విమానం మిస్స‌య్యాడ‌ని టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టు నుంచి త‌ప్పించారు

  • వెస్టిండీస్ బ్యాట‌ర్ షిమ్ర‌న్ హెట్‌మ‌య‌ర్ పై వేటు
  • అత‌ని స్థానంలో ష‌మారా బ్రూక్స్ కు చోటు
  • ఆస్ట్రేలియా వెళ్లాల్సిన విమానం అందుకోలేక‌పోవ‌డ‌మే కార‌ణం
సాధార‌ణంగా గాయ‌ప‌డితేనో.. ఫామ్ కోల్పోతేనో జ‌ట్టు నుంచి వేటు వేస్తారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లాంటి మెగా టోర్నీకి ఎంపిక చేసిన జ‌ట్టులో మార్పులు చేయాలంటే ఒక‌టికి వంద‌సార్లు ఆలోచిస్తారు. కానీ, వెస్టిండీస్ టీ20 జ‌ట్టులో అనూహ్య మార్పు జ‌రిగింది. ఆ టీమ్ మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్‌, విధ్వంసకర వీరుడు షిమ్రన్ హెట్ మెయిర్ ను ఈ నెల ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగే టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించారు. చివరి నిమిషంలో త‌ను జట్టుకు దూరమయ్యాడు. ఎయిర్ పోర్టుకు సరైన సమయంలో రాకపోవడమే దీనికి కార‌ణ‌మైంది.

టీ20 ప్రపంచ క‌ప్‌న‌కు ముందు విండీస్‌ రేప‌టి నుంచి ఆస్ట్రేలియాతో  టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఇందుకోసం వెస్టిండీస్ జ‌ట్టు ఈనెల 1వ తేదీనే ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే, కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగా తాను ఆ రోజు రాలేనని హెట్‌మ‌య‌ర్ చెప్ప‌డంతో అత‌ని కోసం ఈ నెల 3వ తేదీన (సోమ‌వారం) ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. గ‌యానా నుంచి  న్యూయార్క్ వెళ్లి అక్క‌డి నుంచి అత‌ను ఆస్ట్రేలియా చేరుకోవాల్సి ఉంది. కానీ, సోమ‌వారం కూడా విమానం బ‌య‌ల్దేరే స‌మ‌యానికి తాను ఎయిర్ పోర్టుకు రాలేన‌ని హెట్‌మ‌య‌ర్ వెస్టిండీస్ బోర్డుకు తెలియజేశాడు. దాంతో, అత‌ని స్థానంలో ష‌మారా బ్రూక్స్ ను త‌మ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో చేర్చిన‌ట్టు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి స‌మాచారం ఇచ్చింది. 

హెట్‌మ‌య‌ర్ విన‌తితో అత‌ని ప్ర‌యాణాన్ని ఇప్ప‌టికే ఒక‌సారి రీషెడ్యూల్ చేశామ‌ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్‌కు తెలిపారు. త‌దుప‌రి ఆల‌స్యం, స‌మ‌స్య‌లు ఎదురైతే జట్టులో అత‌ని స్థానాన్ని మ‌రొక‌రితో భ‌ర్తీ చేయ‌డం త‌ప్ప వేరే మార్గం ఉండ‌ద‌ని హెట్‌మ‌య‌ర్‌కు ముందే స్ప‌ష్టం చేశామ‌న్నారు. అత్యంత ముఖ్యమైన ప్రపంచ ఈవెంట్‌కు జ‌ట్టు సిద్ధమయ్యే విష‌యంలో రాజీ ప‌డ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. 

టీ20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ జ‌ట్టు: నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, యానిక్ కరియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షమారా బ్రూక్స్, జేసన్ హోల్డర్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, బ్రెండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఓబెడ్ మెకాయ్, రేమన్ రీఫర్, ఓడియన్ స్మిత్.


More Telugu News