ఇవి వరల్డ్ రికార్డు పిల్లులు... ఎందుకో చూడండి!

  • ప్రపంచంలో అతి ఎత్తయిన పిల్లిగా నిలిచిన ఫెన్రిర్
  • అతి పొడవైన తోకతో గిన్నిస్ బుక్ కు ఎక్కిన ఆల్టేర్
  • అమెరికాలోని మిచిగన్ లో పెంచుకుంటున్న విలియం జాన్ అనే వ్యక్తి
మనం మామూలుగానే పిల్లులను చూస్తుంటాం. చాలా మంది పిల్లులను పెంచుకుంటుంటారు కూడా. అయితే ఎవరి దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా పిల్లుల పరిమాణం కొంత వరకే ఉంటుంది. కొందరి వద్ద పిల్లులు పెద్దగా ఉంటే.. చాలా మంది దగ్గర చాలా చిన్నవిగానే ఉంటాయి. అయితే అమెరికాలోని మిచిగన్ కు చెందిన విలియం జాన్ వద్ద ఉన్న ఫెన్రిర్, ఆల్టేర్ అనే పిల్లులు మాత్రం అన్నింటికన్నా ప్రత్యేకం. ఎందుకంటే ఒకటి ప్రపంచంలోనే ఎత్తయిన పిల్లిగా, మరొకటి పొడవైన తోక ఉన్న పిల్లిగా రికార్డులు సృష్టించాయి మరి.

ఫెన్రిర్.. చాలా ఎత్తుతో.. 
విలియం జాన్‌ కు పిల్లులు అంటే ఎంతో ఇష్టం. దానితో ఆయన చాలా పిల్లులను పెంచుకుంటున్నారు. అందులో ఫెన్రిర్ పిల్లి ఏకంగా 18.83 అంగుళాలు (ఒక అడుగుపై 6.83 అంగుళాలు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పెంపుడు పిల్లిగా ఇటీవలే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. నిజానికి ఆర్కురస్‌ అనే పిల్లి 19.05 అంగుళాల ఎత్తుతో రికార్డు సృష్టించింది. కానీ అది చనిపోవడంతో ప్రస్తుతం రికార్డు ఫెన్రిర్ పరమైంది.

పొడవైన తోకతో.. ఆల్టేర్
విలియం జాన్ వద్దే ఉన్న మరో పిల్లి ఆల్టేర్ అతి పొడవైన తోకతో గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఆల్టేర్‌ తోక పొడవు ఏకంగా 16.07 అంగుళాలు కావడం గమనార్హం. నిజానికి దీనికంటే ముందు.. సైనస్‌ అనే మరో పిల్లి 17.58 అంగుళాల పొడవైన తోకతో రికార్డుల్లోకి ఎక్కినా.. అది చనిపోవడంతో తాజా రికార్డు ఆల్టేర్ పేరిట నమోదైంది.

ఈ పిల్లులకు సంబంధించిన వీడియోలను గిన్నిస్ బుక్ సంస్థ తమ యూట్యూబ్ చానల్ లో పెట్టింది. ఈ వీడియోలకు పెద్ద సంఖ్యలో వ్యూస్ కూడా వస్తున్నాయి.



More Telugu News