చేపను పట్టిన సంబరంలో సెల్ఫీ దిగి.. చేపకు బదులు ఫోన్‌ ను ఏట్లో పడేశాడు.. సరదా వీడియో ఇదిగో

  • బోట్ లో వెళ్తూ ఓ చేపను పట్టుకున్న వ్యక్తి.. తానే పట్టుకున్నానంటూ చేపతో సెల్ఫీ
  • తర్వాత ఓ చేతిలోని చేపను పడేయబోయి మరో చేతిలోని ఫోన్ ను పడేసిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఒక్కోసారి ఏదైనా చేసినప్పుడు సంబరపడిపోవడం, ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఫీలవడం మామూలే. స్మార్ట్ ఫోన్లు వచ్చాక అయితే.. వెంటనే సెల్ఫీలు దిగడం కూడా మామూలుగా మారిపోయింది. కానీ ఈ సెల్ఫీలే చాలా సార్లు కొంప ముంచుతున్నాయి. ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటే.. మరికొన్నిసార్లు చిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది.

ఏమరుపాటులో చేపకు బదులుగా..

ఓ వ్యక్తి మోటార్‌ బోట్‌ లో సముద్రంలోకి వెళ్లాడు. వేటాడుతూ ఓ చేపను పట్టుకున్నాడు. చూశారా నేను చేపను పట్టేసుకున్నాను అంటూ.. ఎడమ చేతిలో చేపను, కుడి చేత్తో ఫోన్ ను పట్టుకుని సెల్ఫీ తీసుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉందిగానీ.. ఈ సరదా పని అయిపోయాక చేపను తిరిగి సముద్రంలోకి విసిరేద్దామనుకున్నాడు. అయితే, ఎడమ చేతిలోని చేపకు బదులు.. కుడి చేతిలోని ఫోన్ ను సముద్రంలోకి విసిరేశాడు. 

ఇక తానేం చేశాడన్నది గమనించేలోపే ఫోన్ సముద్రం పాలైంది. అది చూసి అవాక్కయిపోయాడు. ఏం చేస్తాడు. మొహం అదోలా పెట్టాడు. ఇదంతా పక్కనే మరో బోట్ లో వెళుతున్న వ్యక్తి వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టగా విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిలో పడిపోయాడంటూ ఆ వ్యక్తిపై సెటైర్లు పడుతున్నాయి. 

కోటీ 28 లక్షల వీక్షణలు..

కొందరేమో ‘ఏమరుపాటుగా ఉంటే ఇలాగే ఉంటుంది’ అంటుంటే.. మరికొందరు ‘ఫోన్‌ కంటే ఆ చేపనే బాగుందని అనుకున్నాడేమో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘అది నిజమైన ఫోనేనా లేక.. కావాలని ఫేక్ ప్రాంక్ వీడియో తీశారా?’ అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం.. ట్విట్టర్ లో ఈ వీడియోను ఏకంగా కోటీ 28 లక్షల మంది వీక్షించడం గమనార్హం. లక్షన్నర దాకా లైకులు, 30 వేల దాకా రీట్వీట్లు కూడా వచ్చాయి.


More Telugu News