మనుషులు మంచివాళ్లు కాదా?: పర్యాటకుల వద్దకు వెళ్తున్న గున్న ఏనుగును ఆపేసిన తల్లి ఏనుగు.. వీడియో ఇదిగో!

  • పిల్ల ఏనుగుతో కలిసి రోడ్డు దాటుతున్న ఏనుగు
  • సందర్శకులను చూసి వెళ్లేందుకు ప్రయత్నించిన గున్న ఏనుగు
  • ముందుకొచ్చి తొండంతో దానిని ఆపేసి తీసుకెళ్లిపోయిన తల్లి ఏనుగు
  • ఇదంతా మనతప్పేనంటున్న నెటిజన్లు
మానవులు మంచివాళ్లేనా? ఇదేం ప్రశ్న అన్న అనుమానం వస్తే ఈ వీడియో చూడాల్సిందే. సృష్టిలోనే అతి బలవంతుడైన మానవుడు మేధోశక్తి కారణంగా అన్నింటిపైనా పైచేయి సాధిస్తున్నాడు. బలవంతుడినన్న భ్రమలో బతుకుతూ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. 

సరదా కోసమో, స్మగ్లింగ్ కోసమే వన్యప్రాణులను యథేచ్ఛగా వేటాడుతూ వాటి ఉసురుతీస్తున్నాడు. ఫలితంగా ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తూ తనను తానే నష్టపరుచుకుంటున్నాడు. మనిషిని మనిషి విశ్వసించే రోజులు పోయాయి. ఇప్పుడు జంతువులు కూడా మనుషుల్ని నమ్మడం మానేశాయి. వారు తమకు హాని తలపెట్టడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో.

ఓ పార్క్‌లో గున్న ఏనుగుతో కలిసి తల్లి ఏనుగు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో అక్కడున్న సందర్శకులను చూసిన గున్న ఏనుగు వారి వద్దకు వెళ్తుండగా అప్రమత్తమైన తల్లి ఏనుగు ముందుకు నడిచి ‘వారు మంచోళ్లు కాదు.. వెళ్లొద్దు’ అన్నట్టుగా తొండంతో దానిని ఆపి తనతో తీసుకెళ్లిపోయింది. పిల్ల ఏనుగుపై తల్లి ఏనుగు చూపించిన ప్రేమకు ఇది నిదర్శనమే కాదు.. మనుషుల పట్ల వాటిలో ఏర్పడిన ద్వేషభావానికి ఇది ఉదాహరణ కూడా. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. 

 ఇది ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు కానీ.. నెటిజన్లు మాత్రం చాలా బాధగా స్పందిస్తున్నారు. మనుషులను చూస్తే జంతువులు భయపడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేటాడడం, వాటిపట్ల క్రూరంగా ప్రవర్తించడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇది మన తప్పేనంటూ కామెంట్లు చేస్తున్నారు.  

'‘ఇది చాలా బాధాకరం. మనుషుల్ని నమ్మకూడదన్న విషయాన్ని అవి గ్రహించాయి. ఇది పూర్తిగా మన తప్పే’’ అని మరొకరు కామెంట్ చేశారు. జంతువులన్నీ మనుషుల్ని అసహ్యించుకుంటున్నాయని, ముఖ్యంగా ఏనుగులు అస్సలు నమ్మడం లేదని ఇంకొకరు పేర్కొన్నారు. ఇలా పలు రకాల కామెంట్లతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది.


More Telugu News