వైద్యుడిపై దాడిచేసిన మిజోరం ముఖ్యమంత్రి కుమార్తె.. ‘సారీ’ చెప్పిన సీఎం

  • డెర్మటాలజిస్టును కలిసేందుకు వెళ్లిన సీఎం కుమార్తె
  • అపాయింట్‌మెంట్ లేకుండా చూడబోనన్న వైద్యుడు
  • ఆగ్రహంతో అందరూ చూస్తుండగానే పిడిగుద్దులు
  • ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ 
ఆమె ఓ ముఖ్యమంత్రి కుమార్తె. హుందాగా వ్యవహరించాల్సిన ఆమె ఆ విషయాన్ని మర్చిపోయింది. సీఎం కుమార్తెనన్న అహం చూపించింది. వైద్యుడిపైనే చేయి చేసుకుంది. కుమార్తె చేసిన పనికి ఆ తర్వాత ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. మిజోరంలో జరిగిందీ ఘటన. 

రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారీ చాంగ్టే రాజధాని ఐజ్వాల్‌లో ఓ క్లినిక్‌కు వెళ్లారు. అపాయింట్‌మెంట్ లేకుండా నేరుగా వైద్యుడి వద్దకు వెళ్లడంతో.. తాను చూడాలంటే అపాయింట్‌మెంట్ ఉండాల్సిందేనని డెర్మటాలజిస్ట్ ఆమెకు స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు రుచించకపోవడంతో చాంగ్టే అందరూ చూస్తుండగానే వైద్యుడిపైకి దూసుకెళ్లి ముఖంపై పిడిగుద్దులతో దాడిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో సీఎంపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు, వైద్యుడిపై దాడిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా నిరసనలకు దిగింది. నల్లబ్యాడ్జీలతో వైద్యులు విధులకు హాజరయ్యారు. దీంతో ముఖ్యమంత్రి జోరంతంగా దిగిరాక తప్పలేదు. తన కుమార్తె చేసిన తప్పునకు ఆయన బహిరంగ క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. డెర్మటాలజిస్టుతో తన కుమార్తె తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఆమె ప్రవర్తన ఏ విధంగానూ సమర్థనీయం కాదని పేర్కొంటూ చేతి రాతతో ఉన్న నోట్‌ను సీఎం షేర్ చేశారు.


More Telugu News