యూఏఈ, దక్షిణాఫ్రికాలోనూ ఫ్రాంచైజీలు తెరిచిన ముంబయి ఇండియన్స్

  • ముంబయి ఇండియన్స్ విస్తరణ
  • విదేశీ లీగ్ ల కోసం కొత్తగా రెండు ఫ్రాంచైజీలు
  • యూఏఈలో 'ఎంఐ ఎమిరేట్స్' గా రంగప్రవేశం
  • దక్షిణాఫ్రికాలో' ఎంఐ కేప్ టౌన్' గా ఎంట్రీ
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్. రిలయన్స్ గ్రూప్ కు చెందిన ఈ ఫ్రాంచైజీ భారత్ వెలుపల కూడా కార్యకలాపాలకు తెరలేపింది. విస్తరణలో భాగంగా యూఏఈ, దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లలోనూ ఫ్రాంచైజీలు తెరిచింది. యూఏఈలో ముంబయి ఇండియన్స్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికాలో ముంబయి ఇండియన్స్ కేప్ టౌన్ పేరిట ఈ ఫ్రాంచైజీలకు నామకరణం చేసింది. 

ముంబయి ఇండియన్స్ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ యూఏఈలో నిర్వహించే అంతర్జాతీయ టీ20 లీగ్ లో పాల్గొంటుంది. ముంబయి ఇండియన్స్ కేప్ టౌన్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించే టీ20 లీగ్ లో పాల్గొంటుంది. 

దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ స్పందించారు. ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్ టౌన్ ఫ్రాంచైజీలను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ క్రికెట్ ను మించినదని, జీవితంలో కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడం, నిర్భయంగా ఉండడం, సానుకూల దృక్పథం వంటి అంశాలకు తమ ఎంఐ ఫ్రాంచైజీ ప్రతిరూపమని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ముంబయి ఇండియన్స్ కి పేరుప్రతిష్ఠలు ఉన్నాయని, తమ కొత్త ఫ్రాంచైజీలు ఆ వారసత్వాన్ని మరింత ఎత్తుకు తీసుకెళతాయని ఆశిస్తున్నట్టు నీతా అంబానీ తెలిపారు.


More Telugu News