ఇక మన డ్రెస్సుతోనే మొబైల్, ల్యాప్ టాప్ చార్జింగ్ చేసుకోవచ్చు.. కరెంటు పుట్టించే సరికొత్త ఫ్యాబ్రిక్ ను తయారు చేసిన శాస్త్రవేత్తలు!
- సింగపూర్ కు చెందిన నాన్ యాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల రూపకల్పన
- శరీర కదలికల ఆధారంగా గణనీయ స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి
- ఉతికినా, మడతపెట్టినా పాడైపోదని చెబుతున్న పరిశోధకులు
కదలిక అంటేనే శక్తి.. థర్మల్, జల విద్యుత్ అయినా, పవన విద్యుత్ అయినా కదలికల నుంచే విద్యుత్ పుడుతుంది. మన శరీరంలోనూ నిరంతరం ఏదో ఒక రకంగా కదలికలు ఉంటూనే ఉంటాయి. మరి ఈ కదలికల నుంచి విద్యుత్ పుట్టించగలిగితే బాగుంటుంది కదా అన్న ఆలోచన చాలా మంది శాస్త్రవేత్తలకు వచ్చింది. ఈ క్రమంలోనే విద్యుత్ ను పుట్టించగల వస్త్రాల రూపకల్పనకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా సింగపూర్‌కు చెందిన నాన్ యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరెంటు పుట్టించగల వస్త్రాన్ని అభివృద్ధి చేయగలిగారు.
ప్రయోగాత్మకంగా చిన్నగా..
నాన్ యాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా మూడు సెంటీమీటర్ల పొడవు, నాలుగు సెంటీ మీటర్ల వెడల్పు ఉన్న ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ ను ఇటీవల తయారు చేశారు. ఈ ఫ్యాబ్రిక్ రబ్బరు తరహాలో కొంత వరకు సాగుతుందని.. దీనితో వస్త్రాలు కుట్టి ధరించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లీ పూయి వెల్లడించారు.
ప్రయోగాత్మకంగా చిన్నగా..
నాన్ యాంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా మూడు సెంటీమీటర్ల పొడవు, నాలుగు సెంటీ మీటర్ల వెడల్పు ఉన్న ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ ను ఇటీవల తయారు చేశారు. ఈ ఫ్యాబ్రిక్ రబ్బరు తరహాలో కొంత వరకు సాగుతుందని.. దీనితో వస్త్రాలు కుట్టి ధరించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లీ పూయి వెల్లడించారు.
- ఈ వస్త్రాన్ని అటూ ఇటూ లాగినప్పుడు, సాగదీసినప్పుడు, వంచడం, మెలిపెట్టడం వంటివి చేసినప్పుడు.. దానిలోంచి విద్యుత్ పుడుతుందని వివరించారు.
- తాము ప్రత్యేకమైన ప్లాస్టిక్ ను ఉపయోగించి తయారు చేసిన చిన్న ఫ్యాబ్రిక్ ముక్క ఎల్ఈడీ బల్బును వెలిగించే స్థాయిలో కరెంటును ఉత్పత్తి చేయగలిగిందని లీపూయి తెలిపారు.
- సుమారు ఐదు నెలల పాటు ఈ వస్త్రాన్ని చాలాసార్లు ఉతికి, మడిచి, కొంత వరకు సాగదీసి చూశామని, అయినా సమర్థవంతంగా పనిచేసి విద్యుత్ ను అందించిందని వెల్లడించారు.
- ఇంతకుముందు కూడా విద్యుత్ ఉత్పత్తి చేయగల వస్త్రాలను కొందరు శాస్త్రవేత్తలు రూపొందించారని.. కానీ వాటి నుంచి వచ్చే విద్యుత్ అతి తక్కువగా ఉండటం, సదరు వస్త్రం త్వరగా దెబ్బతినడం వంటి సమస్యలతో అవి విజయవంతం కాలేదని స్పష్టం చేశారు.
- తాము తయారు చేసిన ఫ్యాబ్రిక్ ను చేర్చి వస్త్రాలను తయారు చేస్తే.. ఏకంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లకు కావాల్సిన స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు.