కమీషన్లు లేకపోతే కల్వకుంట్ల వారు కదలరా?: ప్రాజెక్టులు నీట మునగడంపై రేవంత్ ఫైర్

  • ప్రాజెక్టుల నిర్వహణకు రూ.1000 కోట్లయినా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న
  • రాష్ట్రంలో నీట మునిగిన పంటలు కనిపించడం లేదా అంటూ నిలదీత
  • వార్తా పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్స్ ను జత చేస్తూ వరుస ట్వీట్లు చేసిన రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపుహౌస్ లు నీట మునగడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ ఓ వార్తా పత్రికలో వచ్చిన క్లిప్పింగ్స్ ను జత చేస్తూ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘ప్రాజెక్టుల నిర్మాణానికి లక్ష కోట్లకు పైగా వెచ్చించామని చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. వాటి నిర్వహణకు రూ.1000 కోట్లు కూడా ఎందుకివ్వడం లేదు? ఇది సింపుల్.. కమీషన్లు లేకపోతే కల్వకుంట్ల వారు కదలరా..?! పైసలుంటేనే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకుంటాయా…?!” అని ప్రశ్నిస్తూ వరుసగా ట్వీట్లు చేశారు. 

నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపుహౌజ్ లు మునగడంపై గురువారమే ‘‘రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం (అన్నారం పంప్ హౌస్) నీళ్లలో నిండా మునిగింది. తెలంగాణ ప్రజల కష్టార్జితం కేసీఆర్ అవినీతికి బలైంది” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

పంట నష్టం కళ్లకు కనిపించడం లేదా?
భారీ వర్షాలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని.. కానీ నష్టమే జరగలేదని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పంట నష్టంపై వచ్చిన వార్తలను జత చేస్తూ మరో ట్వీట్ చేశారు.

‘‘రాష్ట్రంలో భారీ వర్షాలతో 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అసలు నష్టమే జరగలేదని ట్విట్టర్ పిట్ట కారుకూతలు కూస్తోంది. ప్రజల కష్టం.. పంట నష్టం ఇంత తీవ్రంగా ఉంటే కళ్లకు కనిపించడం లేదా?” అని ప్రశ్నించారు. ఇదిలావుంచితే, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ జమీర్ మరణం పట్ల రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జమీర్ కుటుంబ సభ్యులకు, బంధువులు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు.


More Telugu News