లావణ్య ‘హ్యాపీ బర్త్​డే’ డేట్​ మారింది

  • జులై 8వ తేదీన విడుదలవుతున్న ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రం
  • ముందుగా జులై 15న అనుకున్న చిత్ర బృందం
  • లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు తన అందంతో పాటు అభినయాన్ని చూపెట్టిన నటి లావణ్య త్రిపాఠి. ఈ ఉత్తరాఖండ్ ముద్దుగుమ్మ ఇప్పటిదాకా ఇతర హీరోల సరసన హీరోయిన్ గా మాత్రమే నటించి మెప్పించింది. ఇప్పుడు తన కెరీర్‌‌లో మొదటిసారి నాయికా ప్రాధాన్య చిత్రం చేస్తోందామె. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రంలో లావణ్య హీరోయిన్. ఇందులో కథ మొత్తం లావణ్య చుట్టూనే తిరుగుతుంది. ఈ చిత్రాన్ని జులై 15న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం మొదట ప్రకటించింది. కానీ, జులై 8నే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నామని తాజాగా వెల్లడించింది. 

నిజానికి జులై 8వ తేదీన నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమా విడుదల కావాలి. ఇతర కారణాల వల్ల ఈ చిత్రాన్ని జులై 22కి వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇప్పుడు ఆ స్లాట్ ఖాళీ కావడంతో  కాస్త ముందుగా వచ్చేస్తే మంచిదని ‘హ్యాపీ బర్త్‌డే’ బృందం భావించింది. దాంతో, విడుదల తేదీని ముందుకు మార్చుకుంది. 

ఈ చిత్రంలోని పాత్రలు, కథ  భిన్నంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ వైవిధ్యంగా ఉండి ఆసక్తిగా ఉంది. ప్రధాన క్యారెక్టర్స్ కూడా సరికొత్తగా ఉండి ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించింది. ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం కాలభైరవ అందించాడు.


More Telugu News