సొంతగడ్డపై పులుల్లా రెచ్చిపోయిన గుజరాత్ బౌలర్లు... ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన అమిత్ షా

  • అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 రన్స్
  • 39 పరుగులు చేసిన బట్లర్
  • 3 వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు ఏదీ కలిసిరాలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టును గుజరాత్ టైటాన్స్ బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. ఏ దశలోనూ భారీ స్కోరు సాధించేలా కనిపించని రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులతో సరిపెట్టుకుంది. ఫామ్ లో ఉన్న జోస్ బట్లర్ 39 పరుగులు చేయగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేశాడు. ఆ జట్టులో వీరిద్దరూ తప్ప మరెవ్వరూ రాణించలేదు. 

కెప్టెన్ సంజూ శాంసన్ 14, దేవదత్ పడిక్కల్ 2, హెట్మెయర్ 11, అశ్విన్ 6, రియాన్ పరాగ్ 15, బౌల్ట్ 11, మెక్ కాయ్ 8 పరుగులు చేశారు. బట్లర్ క్రీజులో ఉన్నంతసేపు ధీమాగా కనిపించిన రాజస్థాన్ రాయల్స్... అతడు అవుట్ కాగానే ఢీలాపడిపోయింది. బట్లర్ వికెట్ ను గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పడగొట్టడం విశేషం. గుజరాత్ బౌలర్లలో పాండ్యాకు 3 వికెట్లు, సాయి కిశోర్ కు 2, షమీకి 1, యశ్ దయాళ్ కు 1, రషీద్ ఖాన్ కు 1 వికెట్ దక్కాయి. 

కాగా, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన అర్ధాంగి సోనాల్ షాతో కలిసి హాజరయ్యారు. సతీసమేతంగా మ్యాచ్ ను ఆసక్తిగా తిలకిస్తూ కెమెరా కంటికి చిక్కారు.
.


More Telugu News