వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నాం.. తిరుమలకు ఇప్పుడెవరూ రావొద్దు: టీటీడీ విజ్ఞప్తి

  • వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
  • రెండున్నర కిలోమీటర్ల వరకు క్యూ
  • వీఐపీలు, భక్తులు ఇప్పుడు తిరుమలకు రావొద్దని విజ్ఞప్తి
  • గంటకు 4,500 మందికి మాత్రమే దర్శనం
  • శ్రీవారి దర్శనానికి రెండు రోజుల సమయం
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ తగ్గే వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీ తగ్గేంత వరకు వీఐపీలు, భక్తులు తిరుపతి పర్యటనను వాయిదా వేసుకోవాలని కోరారు. అధికారులతో కలిసి నిన్న సాయంత్రం భక్తుల క్యూలను తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రద్దీ విపరీతంగా ఉందని, గంటకు 4,500 మందిని మాత్రమే దర్శనం చేయించగలమని చెప్పారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తమ పర్యటనను వాయిదా వేసుకుని మరో ప్రణాళిక తయారుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంది. సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. లేపాక్షి మీదుగా అన్నదానం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర క్యూ ఉంది. వీరందరికీ 48 గంటల తర్వాత దర్శనం లభిస్తున్నట్టు టీడీపీ తెలిపింది.


More Telugu News