అవును! అది తప్పుడు నిర్ణయమే.. టెక్సాస్ మారణహోమంపై పోలీసులు

  • నిందితుడిని కట్టడి చేశామని భావించి ఉదాసీనంగా ఉండిపోయిన పోలీసులు
  • దాదాపు 48 నిమిషాలపాటు శిక్షణ పొందిన పోలీసుల కోసం ఎదురుచూపులు
  • ఈ లోపు మరింత పెరిగిన ప్రాణ నష్టం
  • అత్యవసర నంబరుకు పదేపదే ఫోన్ చేసినా స్పందించడంలో పోలీసుల అలసత్వం
  • తప్పును అంగీకరించిన పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ కల్నల్ స్టీవెన్
టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో ఇటీవల ఓ యువకుడు తుపాకితో విరుచుకుపడి 21 మందిని కాల్చిచంపాడు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 19 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రాణ నష్టం భారీగా పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై పోలీసులు స్పందించారు. తప్పు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ ఘటనపై టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ కల్నల్ స్టీవెన్ మెక్‌క్రా మాట్లాడుతూ.. ఘటనా స్థలంలో అసలేం జరిగిందో వివరించారు.

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాఠశాలలో పక్కపక్కనే ఉన్న తరగతి గదుల్లోకి ప్రవేశించిన నిందితుడిని కట్టడి చేశారు. దీంతో పిల్లలకు ఇక ఏమీ కాదని, ప్రాణనష్టం తప్పిందని భావించారు. నిందితుడిని ఎదుర్కొనేందుకు వేచి ఉండాలని ఆన్‌సైట్ కమాండర్, స్కూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ నిర్ణయించారు. సరిగ్గా ఈ నిర్ణయమే మరింత ప్రాణ నష్టానికి దారితీసింది. 

మరోవైపు, నిందితుడు కాల్పులతో విరుచుకుపడుతున్న సమయంలో తప్పించుకున్న చిన్నారులు అత్యవసర నంబరుకు పదేపదే కాల్ చేసి విషయం చెప్పారు. సరిగ్గా 12.47 గంటలకు ఓ విద్యార్థి ఫోన్ చేసి కాల్పుల విషయం చెప్పి వెంటనే పోలీసులను పంపాలని కోరాడు. అయితే, అప్పటికే గది వెలుపల ఉన్న పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా నిపుణులైన శిక్షణ పొందిన సిబ్బంది కోసం దాదాపు 48 నిమిషాలపాటు వేచి చూశారని, ఇలా ఎదురుచూడడంతో నిందితుడికి మరింత ఎక్కువ సమయం దొరికిందని కల్నల్ స్టీవెన్ తెలిపారు. వారు చేరుకున్న తర్వాత 12.50 గంటలకు నిందితుడిపై కాల్పులు జరిపి అతడిని హతమార్చినట్టు చెప్పారు.


More Telugu News