మూవీ రివ్యూ: 'శేఖర్'

  • మలయాళ 'జోసెఫ్'కి ఇది రీమేక్ 
  • కొత్తగా జోడించిన పాటలు
  • నిదానంగా సాగే కథాకథనాలు
  • సహజత్వంతో ఆకట్టుకునే రాజశేఖర్ నటన  
  • స్పీడ్ లేకపోవడమే ప్రధానమైన లోపం
ఒకే సమయంలో ఇటు యాక్షన్ హీరోగాను ... అటు ఫ్యామిలీ హీరోగాను మంచి మార్కులు కొట్టేసిన ఘనత రాజశేఖర్ విషయంలో కనిపిస్తుంది. రాజశేఖర్ కెరియర్ ను పరిశీలిస్తే పోలీస్ ఆఫీసర్ పాత్రలు ఆయనకి బాగా కలిసొచ్చాయనే విషయం అర్థమవుతుంది. ఆయన గ్రాఫ్ పడిపోతున్న ప్రతిసారి పోలీస్ పాత్రలే మళ్లీ ఆయనను నిలబెడుతూ వచ్చాయి. 

అలా ఈ సారి కూడా ఆయన 'శేఖర్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే ప్రేక్షకులను పలకరించాడు. మలయాళ చిత్రమైన 'జోసెఫ్' కి ఇది రీమేక్. జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత దగ్గరగా వెళ్లగలిగిందనేది ఇప్పుడు చూద్దాం.

శేఖర్ (రాజశేఖర్) అరకు ప్రాంతంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. తన మేనమామ కూతురు కిన్నెర (ముస్కాన్) ను ప్రేమిస్తాడు. అయితే శేఖర్ కి తన కూతురును ఇవ్వడం ఇష్టం లేని కిన్నెర తండ్రి వేరే వ్యక్తితో ఆమె పెళ్లి జరిపించేస్తాడు. తరువాత ఇందు (ఆత్మీయ రాజన్)ను శేఖర్ వివాహం చేసుకుంటాడు. వాళ్లకి ఒక ఆడ సంతానం (శివాని) కలుగుతుంది. ఒకసారి శేఖర్ ఒక ఇంట్లో ఒక యువతి మర్డర్ జరిగిందని తెలుసుకుని అక్కడికి చేరుకుంటాడు. రక్తపు మడుగులో గుర్తు పట్టలేనంతగా పడి ఉన్నది కిన్నెర అని తెలుసుకుని షాక్ అవుతాడు.

 పెళ్లికి ముందు కిన్నెర తనతో చనువుగా ఉండటం గురించి తెలిసిన ఆమె భర్త, ఆమెను చిత్రహింసలు పెట్టేవాడని తెలుసుకుని బాధపడతాడు. ఆమె భర్తకి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆ విషయంలో పై అధికారులు మందలించడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. తన కారణంగానే కిన్నెర చనిపోయిందనే బాధతో భార్యకి కూడా దూరంగా ఉంటాడు. అతనిని అపార్థం చేసుకున్న ఇందు విడాకులు తీసుకుంటుంది. కూతురు గీత ఆలనా పాలన శేఖర్ చూస్తుంటాడు. అలా కాలచక్రం గిర్రున తిరిగిపోతుంది. గీత టీనేజ్ లోకి అడుగుపెడుతుంది.

శేఖర్ ఉద్యోగంలో లేకపోయినా కొన్ని కీలకమైన కేసుల్లో డిపార్టుమెంటు ఆయన హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది.  అలాంటి పరిస్థితుల్లోనే అనుకోని విధంగా గీత .. ఆ తరువాత ఇందు ఇద్దరూ కూడా వేరు వేరు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అవుతారు. వాళ్లది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదనీ, పక్కాగా ప్లాన్ చేసి మరీ వాళ్లను చంపారనే విషయం శేఖర్ కి అర్థమవుతుంది. ఈ మరణాల వెనుక మెడికల్ మాఫియా ఉందనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది. అప్పుడు శేఖర్ ఏం చేస్తాడు? తన భార్యాబిడ్డల మాదిరిగా మరెవరి జీవితాలు ముగిసిపోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేదే కథ.

మలయాళంలో ఆ మధ్య వచ్చిన 'జోసెఫ్' సినిమాకి రీమేక్ ఇది. మాతృకలో కథ చాలా సీరియస్ గా నడుస్తుంది. తెలుగుకి సంబంధించి ఈ కథలో మార్పులు చేసినట్టుగా అనిపించదుగానీ, పాటలు మాత్రం పెట్టారు. దర్శకులురాలిగా జీవిత దాదాపు ఒరిజినల్ కంటెంట్ నే ఫాలో అయ్యారని చెప్పాలి. మలయాళంలో సహజత్వానికీ .. ఫీలింగ్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. తెలుగులోను అదే పద్ధతిని అనుసరించడం వలన కథ చాలా స్లోగా నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కళ్లు పెద్దవి చేసి చూసేంత ఇంట్రెస్టింగ్ సీన్స్ గానీ .. ఊపిరి బిగబట్టి చూసేంత ఉంత్కంఠభరిత సన్నివేశాలుగాని తెరపై కనిపించవు. 

 ఇక కథ మొదట్లోనే రెండు మర్డర్లు చూపిస్తారు. ఆ తరువాత శేఖర్ మేనకోడలు కిన్నెర మర్డర్ ను చూపిస్తారు. ఈ సన్నివేశాలను చూపించిన తీరు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. రక్తం మడుగులో పడి ఉన్న శవాలను అన్ని వైపుల నుంచి అంతగా పట్టి పట్టి చూపించవలసిన అవసరం లేదు కదా? అనే భావన కలుగుతుంది. అలాగే దింపుడు కళ్లెంతో సహా శవ సంస్కారాలను చూపించడం కూడా ఇబ్బంది పెడుతుంది. రాజశేఖర్ విషయానికే వస్తే ఆయన ఓల్డ్ లుక్ బావుంది. ఆయన నటన కూడా సహజత్వంతో ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఆయన పోలీస్ పాత్రలు ఆవేశంతో ఊగిపోతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఆయనని చూడటం కొత్తగా అనిపిస్తుంది.

ఇక కథానాయికలుగా ముస్కాన్ తెలుగు ప్రేక్షకులకు ముఖ పరిచయమే. ఆత్మీయ రాజన్ కి తెలుగులో ఇదే మొదటి సినిమా. మలయాళంలో ఆమె చేసిన పాత్రను తెలుగులోను ఆమెతోనే చేయించారు. అలా కాకుండా కాస్త క్రేజ్ ఉన్న వారెవరినైనా తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ముస్కాన్ కనిపించేది కాసేపే అయినా కైపెక్కించే కళ్లతో ఆకట్టుకుంటుంది. పాత్ర పరిధిలో శివాని నటన ఓకే. చివర్లో వచ్చిన ప్రకాశ్ రాజ్ తనదైన మార్క్ చూపించారు.  

ఇక రాజశేఖర్ స్నేహితులుగా ఈ సినిమాలో సమీర్ .. భరణి .. రవివర్మ .. కనిపిస్తారు. ఈ ముగ్గురూ కూడా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలనే ఎక్కువగా చేస్తూ రావడం వలన, ఈ తరహా పాత్రలలో వాళ్లు అతకలేదనిపిస్తుంది. అలాగే పవర్ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అనిపించుకున్న కన్నడ కిశోర్ ను నిస్సహాయుడిగా చూపించడం కూడా. 

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. వాటిలో 'కిన్నెరా .. ఓ కిన్నెరా' అనే పాట చాలా బాగుంది. అయితే ఈ పాటకి డాన్స్ లేకుండా వేరే విజువల్స్ పై నడవడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. బ్యాక్  గ్రౌండ్ మ్యూజిక్ బావుంది .. అక్కడక్కడా ఒరిజినల్ వాడారేమో తెలియదు. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ కూడా ఓకే. దర్శకురాలిగా మూలంలో ఉన్న కథ .. పాత్రలు దెబ్బతినకుండా జీవిత చూసుకున్నారు. అయితే కొన్ని పాత్రలకు కొంతమంది ఆర్టిస్టుల ఎంపిక కరెక్టు కాదేమోనని అనిపిస్తుంది.        

ఈ సినిమా మలయాళ మూలంలో మాదిరిగానే మొదలవుతుంది .. కథకి తగిన ముగింపు అనే అనిపిస్తుంది. ఈ మధ్యలోని సన్నివేశాలు కథకి తగినట్టుగానే సాగుతాయి. పాత్రలు కూడా అందుకు తగినట్టుగానే ప్రవర్తిస్తాయి. తక్కువ పాత్రలు .. తక్కువ బడ్జెట్ అనే విషయాన్ని పక్కన పెడితే, కథలో మంచి పాయింట్ ఉంది .. అది చెప్పిన విధానం బాగుంది. అయితే మలయాళ ప్రేక్షకుల టేస్టు వేరు .. ఇక్కడి ప్రేక్షకుల టేస్టు వేరు. బలమైన విలన్ లేకుండా .. భారీ ట్విస్టులు లేకుండా ఇంత తాపీగా కథను నడిపిస్తే ఇక్కడి వాళ్లకి కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి.

--- పెద్దింటి గోపీకృష్ణ



More Telugu News