ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ముంద‌స్తు ఖ‌రీఫ్ దిశ‌గా కీల‌క నిర్ణ‌యం

  • జూన్ 1 నుంచే గోదావ‌రి డెల్టాకు నీరు
  • జూన్ 10న కృష్ణా డెల్టాకు నీటి విడుద‌ల‌
  • జూన్ 30 నుంచి సీమ ప్రాజెక్టుల నుంచి నీరు విడుద‌ల‌
  • తుపానులు వ‌చ్చే నాటికే పంట చేతికి వ‌స్తుంద‌న్న అంబ‌టి
మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత జ‌రిగిన తొలి ఏపీ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా సాగింది. గురువారం ఏపీ స‌చివాల‌యంలో జ‌రిగిన ఈ కేబినెట్ భేటీ వివ‌రాల‌ను మంత్రులు అంబ‌టి రాంబాబు, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మీడియాకు వివ‌రించారు. ఈ ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్‌ను నిర్ణీత గ‌డువు కంటే ముందుగా ప్రారంభించాల‌న్న దిశ‌గా కేబినెట్ ఓ కీల‌క తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ సంద‌ర్భంగా అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి కేబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. ఈ ఏడాది ముంద‌స్తుగా వ్య‌వ‌సాయ సీజ‌న్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇందులో భాగంగా గ‌తంలో కంటే ముందుగానే కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. 

గోదావ‌రి డెల్టాకు జూన్ 1న నీటిని విడుద‌ల చేస్తామ‌న్న అంబ‌టి.. కృష్ణా డెల్టాకు జూన్ 10 నుంచి నీటిని విడుద‌ల చేస్తామని చెప్పారు. పులిచింత‌ల ప్రాజెక్టు నుంచి జూన్ 10న నీటిని విడుద‌ల చేస్తామ‌ని, నాగార్జున సాగ‌ర్ నుంచి జూన్ 15 నుంచి నీటిని విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు. అదే విధంగా రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల నుంచి జూన్ 30 నుంచి నీటిని విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. 

ఈ క్ర‌మంలో రైతులు ఖ‌రీఫ్‌కు ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని అంబ‌టి సూచించారు. ఖ‌రీఫ్ సీజ‌న్‌ను ముందే ప్రారంభిస్తే.. పంట కూడా ముందుగానే చేతికి వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు. న‌వంబ‌ర్‌లో తుపానులు వ‌చ్చే నాటికే పంట చేతికి వ‌స్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ లెక్క‌న రైతులు కూడా మూడు పంట‌లు వేసుకునే వెసులుబాటు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. గ‌తంలో ప్రాజెక్టులు నిండాక ఆగ‌స్టులో నీరు విడుద‌ల చేసేవార‌ని, తాము మాత్రం ముందుగానే నీటిని విడుద‌ల చేయ‌నున్నామ‌ని అంబ‌టి చెప్పారు.


More Telugu News