కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్‌రామ్ కన్నుమూత

  • 94 సంవత్సరాల వయసులో కన్నుమూసిన సుఖ్ రామ్
  • ఎప్పుడు చనిపోయిందీ వెల్లడించని మనవడు
  • ఐదుసార్లు విధాన సభకు, మూడుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. ఈ నెల 7న ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చామని ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ గత రాత్రి ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. తాత సుఖ్ రామ్‌తో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను ఆ పోస్టుకు జతచేశారు. అయితే, ఆయన తుదిశ్వాస ఎప్పుడు విడిచిందీ వెల్లడించలేదు. 

సుఖ్‌రామ్ ఈ నెల 4న మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఢిల్లీకి తరలించేందుకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రభుత్వ హెలికాప్టర్‌ను పంపారు. 

1993 నుంచి 1996 వరకు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రిగా పనిచేసిన సుఖ్‌రామ్.. హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఐదుసార్లు విధాన సభకు, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జర్మనీ నుంచి గోవులను దిగుమతి చేసుకోవడం ద్వారా రాష్ట్ర రైతుల ఆదాయాన్ని పెంచడంలో సుఖ్ రామ్ కీలక పాత్ర పోషించారు.  కాగా, సుఖ్‌రామ్ మరో మనవడైన ఆయుష్ శర్మ నటుడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆశ్రయ్ శర్మ 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.


More Telugu News