సౌదీ అరేబియాలో ఓ రెస్టారెంటులో సోదాలు చేసిన అధికారులు నివ్వెరపోయారు... ఎందుకంటే...!

  • జెడ్డాలో ఓ రెస్టారెంటు మూసివేత
  • టాయిలెట్ లో సమోసాల తయారీ
  • 30 ఏళ్లుగా ఇదే తంతు
  • వాష్ రూములే కిచెన్లు!
సౌదీ అరేబియా... కఠినమైన చట్టాలకు నెలవు ఈ గల్ఫ్ దేశం. ఇక్కడ అవినీతి, అక్రమాలకు ఆస్కారం తక్కువ అని అందరూ భావిస్తారు. అయితే ఈ దేశంలోనూ అక్కడక్కడా చట్టాల ఉల్లంఘన జరుగుతుంటుంది. కానీ 30 ఏళ్లకు పైగా ఓ రెస్టారెంటులో జరుగుతున్న తంతును చూసి సౌదీ అరేబియా అధికారులను నిర్ఘాంతపోయేలా చేసింది. ఇటీవల జెడ్డా నగరంలోని ఓ రెస్టారెంటుపై అధికారులు దాడులు చేశారు. 

ఈ సందర్భంగా, సమోసాలు, ఇతర స్నాక్స్ ను కిచెన్ లో కాకుండా, అక్కడి టాయిలెట్ లోనూ, ఇతర వాష్ రూముల్లోనూ తయారుచేస్తుండడం వారి కంటబడింది. మరింత లోతుగా విచారిస్తే, గత మూడు దశాబ్దాలకు పైగా సమోసాల తయారీకి టాయిలెట్ నే వినియోగిస్తున్న విషయం వెల్లడైంది. ఈ రెస్టారెంటులో ఆహార పదార్థాల తయారీకి సంబంధించి అధికారులకు కొంత సమాచారం అందింది. దాంతో వారు రెస్టారెంటులో తనిఖీలు చేశారు. 

ఎంతో అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారుచేస్తుండడమే కాదు, ఎక్స్ పైరీ డేట్ అయిపోయి రెండేళ్లు గడిచిన చీజ్, ప్యాకేజ్ డ్ మాంసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఆ రెస్టారెంటుకు అధికారులు తాళం వేశారు. కాగా, యాజమాన్యం ఆ రెస్టారెంటులో పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరికీ హెల్త్ కార్డులు ఇవ్వలేదట. 

గతంలో, జెడ్డాలో షావర్మా అనే ప్రఖ్యాత రెస్టారెంటును కూడా ఇలాంటి పరిస్థితుల్లోనూ అధికారులు మూసివేశారు. అక్కడి ఆహార పదార్థాలపై ఎలుకలు తిరుగుతుండడం వీడియోల ద్వారా వైరల్ అయింది.


More Telugu News