కాంగ్రెస్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి!

  • కాంగ్రెస్ కు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న ప్రశాంత్ కిశోర్
  • ఏపీలో వైసీపీతో కలిసి పోటీ చేయాలని సూచన
  • రాష్ట్రానికి ప్రాధాన్యతనిచ్చే పార్టీకి మద్దతు ఉంటుందన్న విజయసాయి
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారు. దీనిపై వైసీపీ ముఖ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పార్టీ వైఖరి ఎలా ఉండనుందో సూచనప్రాయంగా తెలియజేశారు. 

అటు, వైసీపీలో తనకు పాత పదవి పోయి, కొత్త పదవి లభించడం పట్ల కూడా విజయసాయి వివరణ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించిన అధిష్ఠానం... ఆ స్థానాన్ని వైవీ సుబ్బారెడ్డితో భర్తీ చేసింది. విజయసాయిరెడ్డిని వైసీపీ అనుబంధ సంఘాల సమన్వయకర్తగా నియమించింది. దీనిపై విజయసాయి స్పందిస్తూ, పార్టీ ఏ పదవి అప్పగిస్తే ఆ పదవిని నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. 

తాను గతంలో అనేక పదవులు చేపట్టానని, చిత్తశుద్ధితో పనిచేయడమే తనకు తెలుసని అన్నారు. అంతేకాకుండా, తనకు ఫలానా పదవి కావాలని ఎప్పుడూ కోరుకోనని ఉద్ఘాటించారు.


More Telugu News