అవును, ‘సి’ బ్రాండ్ ఉంది.. విశ్వం ఉన్నంత వరకూ ఉంటుంది: అచ్చెన్నాయుడు

  • అదే చంద్రబాబు నాయుడు బ్రాండ్
  • హైదరాబాద్ విస్తరించడానికి కారణం ఆ బ్రాండే
  • ఏపీ బ్రాండ్ ప్రపంచ దేశాలకు విస్తరించడానికి కారణం ఆ బ్రాండే
  • జగన్ లాగా చీప్ లిక్కర్ బ్రాండ్ కాదంటూ మండిపాటు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నది ‘సి’ బ్రాండేనన్న జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును, రాష్ట్రంలో ‘సి’ బ్రాండ్ ఉందని, అదే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ‘సి’ బ్రాండ్ ఉంటుందన్నారు. 

‘‘హైదరాబాద్ నగరం విస్తరించిందంటే బ్రాండ్ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ కు ఒక పరిశ్రమ వచ్చిందంటే అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు చలవే. దేశం, ప్రపంచానికి ఏపీ బ్రాండ్ ను చాటిచెప్పిన ఘనత చంద్రబాబు నాయుడిది. తెలుగు జాతి ఉన్నంత వరకు, విశ్వం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంటుంది. అది నీలాగా చీప్ లిక్కరు బ్రాండ్ కాదు’’ అన్నారు.   

ఏటా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని ఒక్క మద్యం నుంచే రాబట్టేందుకు ఏపీ సీఎం జగన్ టార్గెట్ పెట్టుకున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అందుకే జాతిపిత మహాత్మా గాంధీ జయంతిరోజునే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. 

మద్యం దుకాణాలు, కంపెనీలన్నీ తన చేతుల్లోకి రావాలన్న ఉద్దేశంతో మద్యం పాలసీని మార్చారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామన్న హామీనిచ్చి.. ఇప్పుడు ఆదాయం కోసం దానినే నమ్ముకోవడం దారుణం అని విమర్శించారు. 

ఈ ముఖ్యమంత్రితో పోరాడడం అంత తేలిక కాదని, కానీ, మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్న ఆవేదనతో తాము కూడా ప్రాణాలకు తెగించి మద్యంపై పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రానికి వేరే ఆదాయమార్గాలేమున్నాయో చూపిస్తామని, మద్యం విధానంపై సభలో చర్చించాలని అడిగితే తమను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లికి నెలనెలా రూ.200 కోట్లు వస్తున్నాయని, దానికి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు. 

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే ఈ మద్యం పాలసీని తీసుకొచ్చారంటూ ముఖ్యమంత్రి జగన్ నిన్న చెప్పిన మాటలన్నీ అవాస్తవాలన్నారు. రాష్ట్రంలో మొలాసిస్ ఎక్కువగా ఉందని, అవి ఎక్కువగా ఉన్న చోటే డిస్టిలరీస్ ఉంటాయని గుర్తు చేశారు. తెలంగాణ విడిపోయినప్పుడు ఆ రాష్ట్రంలోనే డిస్టిలరీలు ఎక్కువగా ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించారని, దీంతో మొలాసిస్ లు ఇక్కడ ఎక్కువగా ఉండడం, డిస్టిలరీలు అక్కడ ఉండడంపై దృష్టిపెట్టిన చంద్రబాబు.. ఏపీలో డిస్టిలరీలు ఏర్పాటు చేసేందుకు కంపెనీలకు విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. 

అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పెట్టిన పథకాలన్నీ రద్దు చేసిన జగన్.. మద్యం పాలసీని మాత్రం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. జగన్ తన బినామీలతో కలిసి డిస్టిలరీలను ఏర్పాటు చేశారన్నారు. ఏదైనా వ్యాపారంలో ఎంచుకునే అవకాశం కొనుగోలుదారుకే ఉంటుందని, షాపు ఓనరుకు కాదని అన్నారు. ఏపీలో మాత్రం ఆ చాయిస్ ను జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలో వినియోగదారులకు కావాల్సిన బ్రాండ్ దొరికే పరిస్థితి లేదని, జగన్ చెప్పిన బ్రాండే దొరుకుతుందని అన్నారు. గతంలో ఎప్పుడైనా నాకు ఈ బ్రాండ్ మందు కావాలని కొనుక్కునేవారని, కానీ, ఇప్పుడు రూ.50 మందు ఇవ్వండి.. రూ.100 మందివ్వండి అని చెప్పి కొనుగోలు చేయాల్సి వస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో ప్రతి ఒక్కరూ ‘జె’ బ్రాండ్ అనే అంటున్నారని చెప్పారు. ఆ మాట తాము చెప్పడం లేదన్నారు. 

మందు తాగవద్దని చెప్పేందుకు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఉందని, కానీ, ప్రభుత్వం చేయాల్సిన ఆ పనిని తాము చేస్తుంటే ఆదాయానికి అడ్డుపడుతున్నారంటూ వక్రీకరిస్తున్నారని ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుల పింఛన్ కోసం మద్యం ఆదాయాన్ని నమ్ముకుంటున్నావా? అంటూ మండిపడ్డారు. తల్లికీ, తండ్రికీ పింఛను ఇచ్చేందుకు కొడుకును చంపుతావా? అంటూ నిలదీశారు.


More Telugu News