పాంటింగ్ ప్లాన్ మామూలుగా లేదుగా..! జట్టు సభ్యుల మధ్య ఫెవికాల్ ‘బాండింగ్’కు ప్రయత్నాలు

  • జట్టులో ఎక్కువ మంది కొత్త ముఖాలే
  • యువ ఆటగాళ్లు ఎక్కువ మందికి చోటు
  • వారి మధ్య ఏకత్వానికి పాంటింగ్ చర్యలు
  • సీనియర్ ఆటగాళ్లకు బాధ్యతల అప్పగింత
ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ లో గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ ఆటతీరుతో అభిమానుల మనసు గెలుచుకుంటున్న జట్టు. హెడ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ శిక్షణలో ఆ జట్టు అంత పటిష్ఠత సాధించిందని చెప్పుకోవాలి. అయితే, ఇటీవల రెండు కొత్త జట్లు ఐపీఎల్ లో భాగంగా కావడంతో మిగిలిన 8 జట్లు కీలక ప్లేయర్లు కొంత మందిని నష్టపోవాల్సి వచ్చింది. దీంతో అన్ని జట్లు కొత్త, పాత రక్తం కలయికతో నూతన రూపును సంతరించుకున్నాయి.

ఈ క్రమంలో జట్టులో భాగమైన ఆటగాళ్లు మిగిలిన వారితో త్వరగా, చక్కగా కలసి పోయేందుకు పాంటింగ్ చర్యలు అమలు చేస్తున్నాడు. తద్వారా అందరూ ఒకటే కుటుంబం అన్న భావనతో సమష్టి ఫలితాలను సాధించాలన్నది ఆయన ప్రణాళిక. వేలానికి ముందు రిషబ్ పంత్, పృథ్వీ షా, అక్సర్ పటేల్, అన్రిచ్ నార్జేలను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. దీంతో కొత్త వారిని తమలో త్వరగా ఇమిడిపోయేలా చూసే బాధ్యతను పాంటింగ్ ఈ నలుగురిపై పెట్టాడు. 

ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగం కాకుండా, కొత్తగా వచ్చిన వారు కలసి పోయేందుకు వారితో కలసి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా చేస్తానని పాంటింగ్ ప్రకటించాడు. ‘‘గదిలో ఉన్నప్పుడు ద్వారాలు తెరిచే ఉంచాలని ఆటగాళ్లకు చెప్పాను. ఒకరికొకరు తెలుసుకోవాలి కోరాను. కోచ్ గా, సీనియర్ ఆటగాడిగా యువ ఆటగాళ్ల పట్ల ప్రేమను చూపించినప్పుడు వారు దాన్ని తిరిగిస్తారు’’ అని పాంటింగ్ చెప్పడం గమనార్హం. 

ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విడత డేవిడ్ వార్నర్, మిట్చెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్, రావ్ మన్ పావెల్, విక్కీ ఓస్ట్వాల్, చేతన్ సకారియా, యాష్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, కమలేష్ నాగర్ కోటి ను వేలంలో దక్కించుకుంది. వీరిలో కొత్త అనే భావనను తొలగించి, జట్టుతో స్నేహంగా కలసిపోయే విధంగా పాంటింగ్ కృషి చేస్తున్నాడు. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కానుండడం తెలిసిందే.


More Telugu News