జీఎస్టీ రేట్ల శ్లాబుల్లో మార్పులకు అవకాశాలు.. కొన్నింటి రేట్లు పెరుగుతాయ్.. కొన్నింటి రేట్లు తగ్గుతాయ్?

  • 12-18 శాతం పన్ను రేట్ల విలీనం
  • 15 శాతం పన్ను రేటు అమలు ప్రతిపాదన
  • ఈ వారంలోనే తేల్చనున్న మంత్రుల బృందం
  • వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ భేటీలో స్పష్టత
జీఎస్టీ రేట్లలో కీలకమైన సంస్కరణకు జీఎస్టీ కౌన్సిల్ నియమించిన రాష్ట్రాల మంత్రుల బృందం కీలక సిఫారసులు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు రకాల పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి. ఆటోమొబైల్, లగ్జరీ ఉత్పత్తులు, ఆరోగ్యానికి హాని చేసే పొగాకు ఉత్పత్తులను 28 శాతం పన్ను పరిధిలో చేర్చారు. మిగిలిన వస్తు, సేవల్లో అధిక శాతాన్ని తీసుకెళ్లి 12, 18 శాతంలో సర్దుబాటు చేశారు.

2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అప్పుడు రెవెన్యూ నూట్రల్ రేటు 15.5 శాతంగా ఉంది. రాష్ట్రాలకు ఈ మేరకు పన్నుల ఆదాయం లభిస్తే అంతకుముందున్న వివిధ రకాల పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతో పోలిస్తే నష్టం ఉండదు. రాష్ట్రాలను ఒప్పించి కేంద్రం జీఎస్టీని ప్రవేశపెట్టింది. కానీ, రెవెన్యూ 11.6 శాతానికే పరిమితమైంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు ఈ మేరకు పన్నుల ఆదాయాన్ని కోల్పోయాయి.

5 శాతం పన్ను రేటు స్థానంలో 8 శాతాన్ని తీసుకురావాలని.. 12 శాతాన్ని, 18 శాతాన్ని కలిపేసి 15 శాతాన్ని అమలు చేయాలన్నది జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదన. రేట్ల క్రమబద్ధీకరణను తేల్చాలని కోరుతూ 2021 సెప్టెంబర్ భేటీలో మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ వారంలోనే ఈ బృందం సమావేశమై 15 శాతం రేటును సూచించొచ్చని తెలుస్తోంది. కాకపోతే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో 15 శాతం రేటు అమలుకు సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

జీఎస్టీ కౌన్సిల్ భేటీ వచ్చే నెల మొదట్లో జరగనుంది. అదే రోజు మంత్రుల బృందం సిఫారసులను పరిశీలించనుంది. ఆదాయం పెంచుకునే దిశగా సిఫారసులు చేయడమే మంత్రుల బృందం కర్తవ్యంగా ఉంది. జీఎస్టీ ఆరంభ రేటును 5 శాతం నుంచి 8 శాతానికి తీసుకెళితే ఏటా అదనంగా రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. హానికారక ఉత్పత్తులపై సెస్సు పెంపును ప్రతిపాదించొచ్చని సమాచారం. 


More Telugu News