మేం బీజేపీకి బీ టీం కాదు.. కాంగ్రెస్ తో జట్టు కడతాం: ఎంఐఎం ఎంపీ

  • ఎన్సీపీతోనూ స్నేహానికి రెడీ అన్న ఇంతియాజ్ జలీల్
  • వాళ్లకు ముస్లిం ఓట్లు కావాలి
  • అందుకు చేతులు కలిపేందుకు మేం సిద్ధం
  • బీజేపీని ఓడించడమే లక్ష్యమన్న మజ్లిస్ మహారాష్ట్ర చీఫ్
బీజేపీకి మజ్లిస్ పార్టీ బీ టీమ్ కానేకాదని ఎంఐఎం మహారాష్ట్ర చీఫ్, ఎంపీ ఇంతియాజ్ జలీల్ స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ తో జట్టు కడతామని అన్నారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీలో ఎన్సీపీ, కాంగ్రెస్ తో పాటు శివసేన కూడా ఉన్న  సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టుకు తాము సిద్ధమని ఇంతియాజ్ జలీల్ ప్రకటించారు. 

శుక్రవారం ఎన్సీపీ నేత, రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపె తన ఇంటికి వచ్చారని, ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తన తల్లి చనిపోవడంతో పరామర్శ కోసమే తోపె వచ్చారని అన్నారు. ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మజ్లిస్ పార్టీ బీ టీమ్ లా వ్యవహరిస్తోందంటూ ఆరోపిస్తున్నారని, అందులో నిజం లేదని చెప్పారు. అందులో భాగంగానే ఎన్సీపీ, కాంగ్రెస్ తో జట్టుకడతామంటూ తోపెకు చెప్పానని, మరి, ఇప్పుడు వాళ్లు సుముఖత చూపిస్తారా? లేదా మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తారా? అనేది చూడాలని అన్నారు. 

‘‘ఈ పార్టీలన్నింటికీ ముస్లింల ఓట్లు కావాలి. ఒక్క ఎన్సీపీనే కాదు.. కాంగ్రెస్ కు కూడా అవసరమే. అలాంటి వాళ్ల కోసం మేం చేతులు కలిపేందుకు సిద్ధమే. దేశానికి బీజేపీ భారీ నష్టాన్ని చేసింది. దాన్ని సరిదిద్దేందుకు బీజేపీని ఓడించడమే మా లక్ష్యం’’ అని చెప్పారు.


More Telugu News