బట్టతలపై జుట్టు మొలిపిస్తారని క్లినిక్ కు వెళ్లాడు... తిరిగొచ్చి గుండెపోటుతో మరణించాడు!

  • పాట్నాలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పాశ్వాన్  
  • ఓ ప్రైవేటు క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్
  • మరుసటిరోజే తీవ్ర అస్వస్థత.. మృతి 
బీహార్ రాజధాని పాట్నాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కమల్ బిఘా గ్రామానికి చెందిన మనోరంజన్ పాశ్వాన్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. బట్టతల ఉండడంతో ఓ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్లినిక్ ను ఆశ్రయించాడు. బుధవారం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న అనంతరం మనోరంజన్ పాశ్వాన్ ఇంటికి వెళ్లాడు. 

అయితే, ఆ మరుసటి రోజే పాశ్వాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్లినిక్ కు తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో మరణించాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ క్లినిక్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనంతరం ఇచ్చిన మందులు వాడడం వల్లే పాశ్వాన్ కు గుండెపోటు వచ్చిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే పాశ్వాన్ మృతికి కచ్చితమైన కారణాలు ఏంటనేది తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.


More Telugu News