కరోనా మహమ్మారికి అసలు ఎంత మంది బలయ్యారు?.. తాజా అధ్యయనం వివరాలు ఇవిగో!

  • అధికారిక లెక్కల కంటే మూడు రెట్లు అధికం
  • స్పానిష్ ఫ్లూ తర్వాత ఎక్కువ మరణాలు కరోనాతోనే
  • యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధన వెల్లడి
  • లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురణ
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అసలు ఎంత మందిని బలి తీసుకుంది..? అధికారికంగా చెబుతున్న లెక్కలు నిజమైనవేనా..? ఆ అంశాలపై తాజాగా ఓ అధ్యయనం జరిగింది. అధికారిక లెక్కల కంటే మూడు రెట్లు ఎక్కువగా మరణాల సంఖ్య ఉంటుందని ఇందులో వెల్లడైంది. 

కరోనా వల్ల మొదటి రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 1.82 కోట్ల మంది మరణించి ఉంటారని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనాకు వచ్చింది. స్పానిష్ ఫ్లూ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని బలితీసుకున్నది ఇదేనని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ జేఎల్ ముర్రే పేర్కొన్నారు.

1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూకు సుమారు 5 కోట్ల మంది బలై ఉంటారని అంచనా. ఈ అధ్యయనం తాలూకు వివరాలు లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ వరకు గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 

కరోనా కారణంగా పరోక్షంగా ఎన్నో మరణాలు చోటు చేసుకున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. వైద్య సదుపాయాల్లేక మరణించిన వారు కూడా ఉన్నట్టు తెలిపారు. మరణాలకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఉంటే, అప్పుడు పౌరులను కాపాడేందుకు మెరుగైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వాలకు సహాయకారిగా ఉంటుందన్నారు.

ఆసుపత్రికి వెళ్లకుండా, పరీక్ష చేయించుకోకుండా కరోనా వైరస్ తో మరణించిన వారు మన దేశంలోనూ పెద్ద సంఖ్యలో ఉండడం గమనించాలి. కరోనా మరణ పరిహారం కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు వచ్చిన దరఖాస్తులు.. అధికారిక మృతుల సంఖ్యతో పోలిస్తే ఒకటి నుంచి మూడు రెట్లు అధికంగా ఉన్నాయి.


More Telugu News