క‌వ‌చ్ ట్ర‌య‌ల్ స‌క్సెస్‌!... ఇక రైలు ప్ర‌మాదాలు ఉండ‌వ్‌!

  • స్వ‌దేశీ సాంకేతిక ప‌రిజ్ఞానంతో క‌వ‌చ్ రూప‌క‌ల్ప‌న‌
  • ఈ వ్య‌వ‌స్థ‌తో ఎదురెదురుగా రైళ్లు దూసుకువ‌చ్చినా ఢీ కొన‌వు
  • మ‌లుపులు, లెవెల్ క్రాసింగ్‌ల వ‌ద్ద రైళ్ల వేగం దానిక‌దే త‌గ్గుతుంది
  • సిగ్న‌ల్ జంపింగ్‌ల‌ను నిరోధిస్తుంది
  • రైల్వే మంత్రి స‌మ‌క్షంలో ట్ర‌య‌ల్ ర‌న్ స‌క్సెస్‌
రైళ్ల‌లో భ‌ద్ర‌త, దాని సామ‌ర్థ్యం పెంపు కోసం స్వ‌దేశీ సాంకేతిక ప‌రిజ్ఞానంతో రూపొందిన ప్ర‌పంచ స్థాయి టెక్నాల‌జీ క‌వ‌చ్ అందుబాటులోకి వ‌స్తే ఇక‌పై రైలు ప్ర‌మాదాలు అనే మాటే విన‌ప‌డ‌ద‌ని చెప్పాలి. ఈ వ్య‌వ‌స్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌స్తే.. ఒకే ప‌ట్టాల‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వ‌చ్చినా... అవి ఢీ కొట్టుకోవు. అల్లంత దూరాన త‌మ‌కు తాము బ్రేకులేసుకుని మ‌రీ నిల‌బ‌డిపోతాయి. 

ఇక వంతెన‌లు, మ‌లుపులు ఉన్న చోట రైలు వేగం దానిక‌దే 30 కిలో మీట‌ర్ల వేగానికి త‌గ్గిపోతుంది. అంతేకాదు.. రెడ్ సిగ్న‌ల్‌ను ప‌ట్టించుకోకుండా పైల‌ట్ రైలును ముందుకు క‌దిలిస్తే.. ఆ రైలు పైల‌ట్ అనుమ‌తి లేకుండానే దానిక‌దే నిలిచిపోతుంది. రైలు ప్ర‌మాదాల‌ను జీరో స్థాయికి త‌గ్గించే దిశ‌గా భార‌తీయ రైల్వే అభివృద్ధి చేసిన క‌వ‌చ్ వ్య‌వ‌స్థ ట్ర‌య‌ల్ ర‌న్ శుక్ర‌వారం నాడు స‌క్సెస్ అయ్యింది.

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో లింగంప‌ల్లి- వికారాబాద్ మ‌ధ్య‌లో శుక్ర‌వారం నాడు రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌, రైల్వే బోర్డు చైర్మ‌న్ విన‌య్ కుమార్ త్రిపాఠిల స‌మ‌క్షంలో క‌వ‌చ్ టెస్ట్ డ్రైవ్ జ‌రిగింది. ఈ ట్ర‌య‌ల్ ర‌న్‌లో క‌వ‌చ్ అధికారులు అనుకున్న మేర‌కు విజ‌యం సాధించారు. ఒకే ప‌ట్టాల‌పై ఎదురెదురుగా ప్ర‌యాణిస్తున్న రెండు రైళ్ల‌లో.. ఒక దానిలో రైల్వే మంత్రి, మ‌రో దానిలో రైల్వే బోర్డు చైర్మన్ ఎక్క‌గా.. అధికారులు టెస్ట్ డ్రైవ్ చేశారు. ఒకే ప‌ట్టాల‌పై ఎదురెదురుగా వ‌స్తున్న ఈ రెండు రైళ్లు వాటి మ‌ధ్య దూరం 380 మీట‌ర్లు ఉండ‌గానే..వాటిలో అప్ప‌టికే అమ‌ర్చిన క‌వ‌చ్ అలెర్ట్ అయిపోయింది. రెండు రైళ్లు వాటిక‌వే బ్రేకులేసుకుని నిలిచిపోయాయి.

ఇక మ‌రో టెస్ట్ డ్రైవ్‌లో మ‌లుపు ఉన్న చోట పైల‌ట్ అనుమ‌తి లేకుండానే రైలు త‌న వేగాన్ని త‌న‌కు తానే గంట‌కు 30 కిలో మీట‌ర్ల‌కు త‌గ్గించేసుకుంది. ఇక క్రాసింగ్ ఉన్న చోట కూడా రైలు త‌న వేగాన్ని నియంత్రించుకుంది. మైడో టెస్ట్ డ్రైవ్‌లో రెడ్ సిగ్న‌ల్‌ను దాటేసి పోతున్న రైలు త‌న‌ను తాను నియంత్రించుకుని నిలిచిపోయింది. ఇలా మూడు టెస్ట్‌ల్లోనూ క‌వ‌చ్ వ్య‌వ‌స్థ సక్సెస్ అయ్యింది. 

క‌వ‌చ్ ప‌రిధిలోకి ఈ ఏడాది 2 వేల కిలో మీట‌ర్ల మేర రైల్వే నెట్ వ‌ర్క్‌ను తీసుకురావాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించిన విష‌యం తెలిసిందే. రైల్వేలో జీరో ప్ర‌మాదాలే ల‌క్ష్యంగా తొలి ద‌శ‌లో క‌వ‌చ్ ప‌రిధిని 2 వేల కిలో మీట‌ర్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ మేర‌కు రైల్వేలో ఈ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టే దిశ‌గా శుక్ర‌వారం ట్ర‌య‌ల్ ర‌న్ జర‌గ్గా..క‌వ‌చ్ అధికారులు ఆశించిన మేర స‌త్ఫ‌లితాలు ఇచ్చేసింది. ఈ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చిన రూట్ల‌లో ఇక‌పై రైల్వే ప్ర‌మాదాల‌న్న‌వే జ‌ర‌గ‌వ‌ని చెప్పొచ్చు.


More Telugu News