మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: ఆర్. కృష్ణయ్య

  • హెయిర్ స్టయిలిస్ట్ ను కులం పేరుతో దూషించిన మోహన్ బాబు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయీ బ్రాహ్మణులు, బీసీ సంఘాలు
  • క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కృష్ణయ్య హెచ్చరిక
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వద్ద ఎన్నో ఏళ్లుగా హెయిర్ స్టయిలిస్ట్ గా పని చేస్తున్న నాగ శ్రీనును కులం పేరుతో దూషించడంతో నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాలు ఆయనపై మండిపడుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ మోహన్ బాబు చాలా దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. 

ఆయన కోసం 12 ఏళ్లు పని చేసిన నాగ శ్రీనును కులం పేరుతో దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణులకు, బీసీ సమాజానికి మోహన్ బాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు లాంటి సంపన్నులను తాము ఎంతో మందిని చూశామని అన్నారు. కులం పేరుతో ఒక వ్యక్తిని కించపరచడం దారుణమని చెప్పారు. మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్క శాతం జనాభా ఉండే సామాజికవర్గం నుంచి వచ్చిన నీవు 56 శాతం జనాభా ఉండే బీసీల గురించి మాట్లాడతావా? అని ప్రశ్నించారు.


More Telugu News