ప్రపంచ దేశాలకు తన వాయుసేన శక్తిని ప్రదర్శించనున్న భారత్.. మార్చి 7న పోఖ్రాన్ లో విన్యాసాలు

  • వాయుశక్తి పేరుతో నిర్వహణ
  • 148 యుద్ధ విమానాలకు చోటు
  • ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ 
ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ రంగంలో భీకరంగా పోరాడుతున్నాయి. మరోవైపు తైవాన్ ను చేజిక్కించుకోవాలన్న కాంక్షతో చైనా రగిలిపోతోంది. ఈ తరుణంలో భారత వాయు సేన (ఎయిర్ ఫోర్స్) కీలక విన్యాసాలను చేపట్టడం యాదృచ్ఛికమే. 

ఎందుకంటే ప్రతి మూడేళ్లకు ఒక పర్యాయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) వాయుశక్తి పేరుతో విన్యాసాలు నిర్వహిస్తుంటుంది. పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధత కోసం ఇలా చేస్తుంటుంది. తద్వారా శత్రుదేశాలకు జాగ్రత్త అనే హెచ్చరిక పంపుతుంటుంది. చివరిగా 2019లో ఎయిర్ ఫోర్స్ వాయు శక్తి విన్యాసాలను చేపట్టింది.

ఈ ఏడాది మార్చి 7న రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లా పోఖ్రాన్ ప్రాంతంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. 148 యుద్ధ విమానాలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. తద్వారా ఐఏఎఫ్ తన శక్తిని చాటి చెప్పనుంది. 

అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు మొదటిసారి విన్యాసాల్లోకి చేరనున్నాయి. సుఖోయ్, మిగ్, తేజాస్ విమానాలు పాలుపంచుకుంటాయి. ఆకాశ్, స్పైడర్ క్షిపణి సామర్థ్యాలను కూడా ఐఏఎఫ్ ప్రదర్శించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ప్రధాని ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ఐఏఎఫ్ ప్రకటించింది.


More Telugu News