చివ‌ర‌కు పార్కును కూడా తాక‌ట్టు పెట్టే ప‌రిస్థితి వ‌చ్చేసింది.. రోడ్ల‌నూ తాక‌ట్టుపెడ‌తారు: చంద్ర‌బాబు

  • జ‌గ‌న్ సీఎం అయ్యాక వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేశారు
  • అప్పు చేయ‌క‌పోతే ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీ
  • రాష్ట్ర భ‌విష్య‌త్తును సీఎం అంధ‌కారంలోకి నెట్టేశారు
  • రాష్ట్రంలోని ఆస్తుల‌న్నీ అమ్మేస్తున్నారు
ఏపీ స‌ర్కారుపై టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మంగ‌ళ‌గిరి నుంచి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ జ‌గ‌న్ సీఎం అయ్యాక వ్య‌వ‌స్థ‌ల‌ను విధ్వంసం చేశార‌ని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేశార‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. అప్పు చేయ‌క‌పోతే ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీ అయ్యే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేశార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

రాష్ట్ర భ‌విష్య‌త్తును సీఎం అంధ‌కారంలోకి నెట్టేశార‌ని అన్నారు. రాష్ట్రంలోని ఆస్తుల‌న్నీ అమ్మేస్తున్నార‌ని, ఇప్పటికే కొన్ని ఆస్తుల‌ను తాక‌ట్టు పెడుతు‌న్నార‌ని విమర్శించారు. క‌లెక్ట‌రేట్లు, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌ను, నిన్న విజ‌య‌వాడ‌లో పార్కును కూడా తాక‌ట్టు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చార‌ని, ఇంకొన్ని రోజులు పోతే రోడ్ల‌ను కూడా తాక‌ట్టు పెడ‌తారని విమ‌ర్శించారు.

చివ‌ర‌కు చెత్త‌పై కూడా ఏపీ ప్ర‌భుత్వం ప‌న్నులు వేస్తోంద‌ని చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. కాగా, పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని అప్ప‌ట్లో జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు గుప్పించార‌ని, మ‌రి ఇప్పుడు అధికారంలో ఉన్న జ‌గ‌న్ ఆ ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయ‌గ‌లిగారా? అని చంద్ర‌బాబు నిల‌దీశారు. పోల‌వ‌రాన్ని 70 శాతం పూర్తి చేశామ‌ని, ఇప్పుడు ఆ ప‌నులు ముందుకు సాగ‌ట్లేద‌ని చంద్ర‌బాబు నాయుడు, అసలు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా స‌మాధానం చెప్పే ధైర్యం జ‌గ‌న్‌కు లేద‌ని ఆయ‌న అన్నారు. 


More Telugu News