ముందు కర్ణాటక హైకోర్టును తేల్చనివ్వండి.. హిజాబ్ పై అత్యవసర విచారణకు తిరస్కరించిన సుప్రీంకోర్టు

  • సరైన సమయంలో విచారణకు సిద్ధం
  • ముందు హైకోర్టును విచారణ చేయనీయండి
  • ఈ అంశాన్ని ఇప్పుడే పెద్దది చేయకండి
  • పిటిషనర్ కు సూచించిన ధర్మాసనం
హిజాబ్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లిం విద్యార్థినులను హిజాబ్ (ముఖానికి వస్త్రం కప్పుకుని)తో ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి కర్ణాటక ప్రభుత్వం అనుమతించకపోవడం తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు విచారిస్తోంది. విచారణ ముగిసే వరకు ఎవరూ మతపరమైన వస్త్రధారణతో రావద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలతో ముస్లిం మహిళలకు నష్టమని, దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతానికి హిజాబ్ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. దేశ పౌరుల అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నాం. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం. దీన్ని ఇప్పుడే పెద్దది చేయకండి’’ అని అన్నారు.

ఇదే అంశంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీంకోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. ‘‘హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు’’ అని పేర్కొన్నారు.


More Telugu News