మరో మూడు గంటల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వరుడి మృతి

  • ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారులో జడ్చర్ల బయలుదేరిన వరుడు
  • మార్గమధ్యంలో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
  • తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి
మరో మూడు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో వరుడు మరణించిన ఘటన వధూవరుల ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం..  మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్‌పల్లికి చెందిన భువనాల చైతన్య కుమార్ (35) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నారాయణపేట జిల్లాలోని తిర్మాలాపూర్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనకు వనపర్తి జిల్లాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.

నిన్న ఉదయం 11 గంటలకు చర్చిలో వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుడు చైతన్య కుమార్ నిన్న ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కారులో జడ్చర్ల బయలుదేరారు. మార్గమధ్యంలో నక్కలబండా తండా మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చైతన్య కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News