రైతు ఖాతాలోకి వచ్చి పడిన రూ. 15 లక్షలు.. మోదీ వేశారనుకుని రూ. 9 లక్షలతో ఇల్లు కట్టుకున్న వైనం.. ఆ డబ్బు మాదేనంటున్న గ్రామ పంచాయతీ

  • మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఘటన
  • ఇప్పటికి తేరుకున్న పంచాయతీ అధికారులు
  • అ డబ్బు మాదేనంటూ లేఖ
  • వెంటనే చెల్లించాలని ఆదేశం
  • తల పట్టుకున్న రైతు
ఓ రైతు జన్‌ధన్ ఖాతాలోకి ఒక్కసారిగా రూ. 15 లక్షలు వచ్చి పడ్డాయి. దీంతో సంబరపడిపోయిన ఆయన వెంటనే ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం రూ. 9 లక్షలు ఖర్చు చేశాడు. మిగిలిన 6 లక్షల రూపాయలను ఏం చేయాలా? అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడే తెలిసిన పిడుగులాంటి వార్త అతడిని కష్టాల్లోకి నెట్టేసింది.

ఇందుకు సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్‌వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్దన్ ఔటే రైతు. గతంలో ఒకసారి తన జన్‌ధన్ ఖాతా చెక్ చేసుకుంటే అందులో రూ. 15 లక్షలు కనిపించాయి. అంతసొమ్ము తన ఖాతాలో కనిపించడంతో తొలుత షాకైన జనార్దన్.. ఆ సొమ్మును ప్రధాని మోదీ తన ఖాతాలో వేశారని భావించి ధన్యవాదాలు చెబుతూ ప్రధాని కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు. తన ఖాతాలో ఉన్న రూ. 15 లక్షల నుంచి రూ. 9 లక్షలు డ్రా చేసి ఇల్లు కట్టుకున్నాడు. అప్పటి వరకు అంతా సవ్యంగానే సాగింది. అయితే, ఆ తర్వాతే అతడికి కష్టాలు మొదలయ్యాయి.

ఇటీవల ధ్యానేశ్వర్‌కు గ్రామ పంచాయతీ నుంచి ఓ లేఖ అందింది. జిల్లా పరిషత్ నుంచి పింప్‌వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీ ఖాతాకు బదిలీ అయ్యాయని, వెంటనే ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని అధికారులు అందులో పేర్కొన్నారు. ఐదు నెలల తర్వాత తేరుకున్న అధికారులు నిదానంగా ఈ లేఖ పంపడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆ లేఖ చదివిన ధ్యానేశ్వర్‌కు నోటమాట పడిపోయినంత పనైంది. ఆ వెంటనే తేరుకుని ఖాతాలో మిగిలి ఉన్న రూ. 6 లక్షలను వారికి చెల్లించాడు. మిగతా రూ. 9 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక తల బద్దలుగొట్టుకుంటున్నాడు.


More Telugu News