ఐపీఎల్ మెగా వేలం కోసం తన పేరును నమోదు చేసుకున్న శ్రీశాంత్

  • కనీస ధరను రూ.50 లక్షలుగా పేర్కొన్న శ్రీశాంత్
  • గత సీజన్ లో శ్రీశాంత్ కనీస ధర రూ.75 లక్షలు
  • ఎవరూ కొనుగోలు చేయని వైనం
  • గతంలో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్
  • 2020లో ముగిసిన నిషేధం
ఫిక్సింగ్ ఆరోపణలతో కెరీర్ మసకబార్చుకున్న కేరళ క్రికెటర్ శ్రీశాంత్ మరోసారి ఐపీఎల్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం కోసం శ్రీశాంత్ తన పేరు కూడా నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.

కాగా, వేలం కోసం తన కనీస ధరను శ్రీశాంత్ రూ.50 లక్షలుగా పేర్కొన్నాడు. గత సీజన్ లో శ్రీశాంత్ కనీస ధర రూ.75 లక్షలు కాగా ఎవరూ అతడిని కొనుగోలు చేయలేదు. శ్రీశాంత్ చివరిసారిగా 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. గతంలో ఐపీఎల్ సందర్భంగా ఫిక్సింగ్ ఊబిలో చిక్కుకున్న శ్రీశాంత్ నిషేధం ఎదుర్కొన్నాడు. కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపాడు.

బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించగా, 2019లో సుప్రీంకోర్టు ఆ నిషేధాన్ని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. దాంతో బీసీసీఐ అతడిపై 7 ఏళ్ల నిషేధం ప్రకటించింది. ఆ నిషేధం 2020 సెప్టెంబరులో ముగిసింది. దాంతో శ్రీశాంత్ అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడేందుకు వెసులుబాటు కలిగింది.

శ్రీశాంత్ ప్రస్తుత వయసు 38 ఏళ్లు కాగా, అంతర్జాతీయ క్రికెట్ కు చాలాకాలం కిందటే దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపించడంలేదు.


More Telugu News