క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసేటప్పుడు మోసాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  • క్యూఆర్ కోడ్ యూఆర్ఎల్ ను గమనించాలి
  • అసలుకు బదులు నకిలీ క్యూఆర్ కోడ్
  • చెల్లింపులకు ముందు వర్తకుడి గుర్తింపును ధ్రువీకరించుకోవాలి
  • లేదంటే మోసానికి ఆస్కారం
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సాయంతో వర్తకుల వద్ద క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి, డబ్బులు చెల్లించే విధానం దేశంలో బాగా విస్తరించింది. నగదు రూపంలో చెల్లించడానికి బదులు డిజిటల్ చెల్లింపులకు ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. అయితే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇటీవలే ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. సైబర్ నేరస్థులు క్యూఆర్ కోడ్స్ ద్వారా ఎలా మోసం చేస్తారన్నది వివరించింది. కనుక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో కొన్నింటిని పరిశీలించాలి.

యూఆర్ఎల్ చూడాలి
ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాత.. కనెక్ట్ అయ్యే యూఆర్ఎల్ చూసుకోవాలి. ఏదైనా హానికారక, నకిలీ యూఆర్ఎల్ కు కనెక్ట్ అవుతున్నారా? అని పరిశీలించుకోవాలి. లేదంటే మోసానికి అక్కడే బీజం పడుతుంది. షార్ట్ యూఆర్ఎల్ కోడ్ తో ఉండే క్యూఆర్ కోడ్ లను స్కాన్ చేయకుండా ఉండడమే మంచిది.

క్యూఆర్ కోడ్ తారుమారు
క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసే ముందు అది నిజంగా ప్రింట్ అయిందేనా? లేక క్యూఆర్ కోడ్ పై వేరే ఏదైనా స్టిక్కర్ అంటించినట్టుందా? అని చూడాలి.

వెబ్ సైట్ లో వద్దు
క్యూఆర్ కోడ్ లు వెబ్ సైట్ సాయంతో ఓపెన్ అయితే చెల్లింపులు చేయవద్దు. ఒకవేళ చేయాల్సి వస్తే డబ్బులను స్వీకరించే వ్యక్తి లేదా వ్యాపార సంస్థ గుర్తింపును ధ్రువీకరించుకున్న తర్వాతే చెల్లింపులు చేయాలి. ఉదాహరణకు శ్రీలక్ష్మీ కిరాణా స్టోర్స్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారనుకోండి.. స్కాన్ తర్వాత అదే పేరు వచ్చిందా? చూసుకుని, పేరును షాపు యజమానితో ధ్రువీకరించుకున్న తర్వాత చెల్లింపులు చేయాలి.

డబ్బులు చెల్లించడానికి కాదు..
క్యూఆర్ కోడ్ స్కాన్ అన్నది డబ్బులు చెల్లించడానికే కానీ, స్వీకరించడానికి కాదు. మెసేజ్ లు, ఈ మెయిల్ కు వచ్చే క్యూఆర్ కోడ్ లను స్కాన్ చేయకండి.


More Telugu News