ఫిక్సింగ్ చేయాలంటూ ఓ వీడియో సాయంతో నన్ను బ్లాక్ మెయిల్ చేశారు: సంచలన వ్యాఖ్యలు చేసిన జింబాబ్వే క్రికెటర్

  • 2019లో భారత్ వచ్చానన్న బ్రెండన్ టేలర్ 
  • ఓ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టు వివరణ
  • ఆ వీడియోతో తనను బెదిరించారని వ్యాఖ్యలు
  • కానీ తాను ఫిక్సింగ్ కు పాల్పడలేదని స్పష్టీకరణ
క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం ఛాయలు ఇంకా తొలగిపోలేదు. తాజాగా జింబాబ్వే బ్యాట్స్ మన్ బ్రెండన్ టేలర్ సంచలన విషయాలు వెల్లడించాడు. స్పాట్ ఫిక్సింగ్ కోసం తాను బుకీల నుంచి 15 వేల డాలర్లు అందుకున్నానని బాంబు పేల్చాడు. ఓ వీడియో సాయంతో తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్తకు చెందిన మనుషుల బలవంతం మీద ఆ డబ్బుకు తాను అంగీకరించాల్సి వచ్చిందని తెలిపాడు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని ఐసీసీతో పంచుకునేందుకు 4 నెలలు వెనుకాడానని బ్రెండన్ టేలర్ పేర్కొన్నాడు.

"గతంలో జింబాబ్వేలో ఓ టీ20 లీగ్ ప్రారంభించేందుకు చర్చల కోసం భారత్ వచ్చాను. ఈ సందర్భంగా కొందరితో కలిసి పార్టీలో పాల్గొన్నాను. మద్యం తాగాం. వారిలో కొందరు బహిరంగంగానే కొకైన్ ఆఫర్ చేశారు. వాళ్లు అప్పటికే డ్రగ్స్ మత్తులో ఉన్నారు. నేను మూర్ఖంగా వారి నుంచి కొకైన్ అందుకున్నాను. ఆ మరుసటి రోజు వాళ్లే నా హోటల్ రూమ్ లోకి దూసుకొచ్చారు. గత రాత్రి నేను డ్రగ్స్ తీసుకున్నప్పటి వీడియోను చూపించారు. తాము చెప్పినట్టు స్పాట్ ఫిక్సింగ్ కు సహకరించకపోతే ఆ వీడియో బయటపెడతామని బెదిరించారు.

ఆ సమయంలో నాకు 15 వేల డాలర్లు అడ్వాన్స్ గా ఇచ్చారు. పని పూర్తయ్యాక మరో 20 వేల డాలర్లు ఇస్తామని చెప్పారు. కానీ నేను ఎలాంటి ఫిక్సింగ్ కు పాల్పడలేదు. కొన్ని తప్పులు చేసి ఉంటానేమో కానీ మోసగాడ్ని మాత్రం కాదు. ఈ విషయాన్ని ఐసీసీ విచారణ జరిపి నాపై కొన్ని సంవత్సరాల నిషేధం విధిస్తుందేమో. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాను" అని టేలర్ స్పష్టం చేశారు. 35 ఏళ్ల టేలర్ జింబాబ్వే తరఫున 34 టెస్టులు, 205 వన్డేలు, 45 టీ20 మ్యాచ్ లు ఆడాడు.


More Telugu News