ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి ప్రకటన

  • వదంతులను ప్రచారం చేయవద్దంటూ విజ్ఞప్తి
  • ఐసీయూలోనే లతా దీదీ ఉన్నారని వెల్లడి
  • డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోందంటూ వివరణ
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఆరోగ్యంపై వదంతులు చక్కర్లు కొడుతుండడంతో మరోసారి ఆమె ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు.

లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని, ఆమెకు చికిత్స కొనసాగుతోందని చెప్పారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఆమెకు చికిత్సను అందిస్తున్నారని చెప్పారు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరారు.

కొన్ని రోజుల క్రితం లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 11న ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి న్యుమోనియా ఉందని తేల్చారు. అప్పట్నుంచి ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. కాగా, లత ఆరోగ్యం క్షీణించిందంటూ గత వారం ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆమె ప్రతినిధి ఆ వార్తలను కొట్టిపారేసి క్లారిటీ ఇచ్చారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఆమె ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కలచివేస్తోందని అన్నారు.


More Telugu News