సినీ పరిశ్రమ సమస్యలను సీఎం అర్థం చేసుకున్నారు.. జగన్ తో భేటీ వివరాలను వెల్లడించిన చిరంజీవి

  • నన్ను ఓ సోదరుడిలా భావించి ఆత్మీయంగా మాట్లాడారు
  • సినిమా టికెట్ రేట్ల జీవోపై ఆలోచిస్తామన్నారు
  • అన్నింటికీ జగన్ సానుకూలంగా స్పందించారు
  • పరిశ్రమలో ఎవరూ నోరు జారొద్దంటూ హితవు
ఏపీ సీఎం జగన్ తనను ఓ సోదరుడిలా భావించి ఆత్మీయంగా మాట్లాడారని చిరంజీవి అన్నారు. సినిమా టికెట్ల ధరల విషయంపై ఇవాళ జగన్ తో భేటీ అనంతరం హైదరాబాద్ కు తిరిగి వెళుతూ గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో ఉన్న సాధకబాధకాలన్నింటినీ జగన్ కు వివరించానని చెప్పారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఇచ్చిన జీవోపై మరోసారి ఆలోచిస్తామంటూ జగన్ చెప్పారని, అది చాలా శుభవార్త అని చిరంజీవి అన్నారు.

కొన్నాళ్లుగా జటిలమవుతున్న సమస్యను పరిష్కరించేందుకు రెండో వైపున అభిప్రాయాలను వినేందుకూ జగన్ సుముఖంగా ఉన్నారన్నారు. వినోదం అందరికీ అందుబాటులో ఉండాలన్న సీఎం జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని చెప్పిన ఆయన.. సీఎంకు థియేటర్ల యజమానులు, సినీ పరిశ్రమ కార్మికులు పడుతున్న ఇబ్బందులను వివరించానని తెలిపారు. థియేటర్లు మూసేసుకోవాల్సి వస్తుందన్న భయంలో యజమానులున్నారని, కాబట్టి నిర్మాణాత్మకమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎంకు చెప్పానని చిరంజీవి తెలిపారు.

సినీ పరిశ్రమ సమస్యలను ఆయన అర్థం చేసుకున్నారన్నారు. అన్నింటికీ ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటానంటూ జగన్ హామీ ఇచ్చారన్నారు. దీనిపై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందంటూ జగన్ ఎంతో భరోసానిస్తూ మాట్లాడారని తెలిపారు. చిన్న సినిమాలకు ఐదో షోపైనా సీఎం సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మాటలపై తనకు ఎంతో నమ్మకం ఏర్పడిందన్నారు.

ఎవరూ అభద్రతా భావంతో ఉండకూడదని చిరంజీవి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపై అతి త్వరలోనే ముసాయిదాను తయారు చేసుకుంటామని వెల్లడించారు. దీనిపై సినీ పరిశ్రమలోని పెద్దలతో మాట్లాడుతామని తెలిపారు. 'సినీ పరిశ్రమకు చెందినవారెవరైనా ఏవేవో ఊహించుకుని నోరు జారకూడదని ఇండస్ట్రీ పెద్దగా కాదు.. బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. సినీ పరిశ్రమ బాగు కోరుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం తనకుందని, కాబట్టి తన మాటలను మన్నించి అందరూ సంయమనం పాటించాలని సూచించారు.


More Telugu News