విద్యార్థినిపై లైంగికదాడి ఆరోపణలు.. శ్రీరామానంద ప్రభు అరెస్ట్

  • సాయిధామంలో ఉంటూ పదో తరగతి వరకు చదువుకున్న బాలిక
  • 2016లో ఒకసారి, 2018లో మరోసారి స్వామీజీ తనపై అత్యాచారం చేశారని ఆరోపణ
  • అరెస్ట్ అక్రమమంటూ సాయిధామంలోని స్కూలు, ఆలయాల మూసివేత
బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల పరిధిలోని సాయిధామం ఆశ్రమ (శ్రీసాయి దత్త) పీఠాధిపతి శ్రీరామానంద ప్రభు అరెస్ట్ అయ్యారు. ఆయనను నల్గొండ జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2004 నుంచి 2018 వరకు సాయిధామం ఆశ్రమంలో ఉంటూ పదో తరగతి వరకు చదువుకున్న బాలికను సీడీబ్ల్యూసీ అధికారులు రెండేళ్ల క్రితం హైదరాబాద్ అమీర్‌పేటలోని స్టేట్ హోంలో చేర్చారు.

గురువారం ఉదయం బాలిక బొమ్మలరామారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. 2016లో ఒకసారి, 2018లో ఒకసారి ఆశ్రమంలో తనపై స్వామీజీ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. దీంతో అదే రోజు రాత్రి స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడికి కోర్టు జనవరి 12 వరకు రిమాండ్ విధించింది. దీంతో స్వామీజీని నల్గొండ జైలుకు తరలించారు. మరోవైపు, స్వామీజీ అరెస్ట్‌పై ఆశ్రమ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ సాయిధామంలోని ఉచిత పాఠశాల, సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాలను మూసివేశారు.


More Telugu News