ఒమిక్రాన్ కేసుల సంఖ్యపై పొంతన లేకుండా మాట్లాడిన బ్రిటన్ ఉప ప్రధాని

  • బ్రిటన్ లో ఒమిక్రాన్ కలకలం
  • 10 కేసులు నమోదయ్యాయన్న ఆరోగ్యమంత్రి
  • ఇవాళ భిన్నంగా స్పందించిన ఉప ప్రధాని
  • 250 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడి
కరోనా డెల్టా వేరియంట్ తో తీవ్ర కుదుపులకు గురైన బ్రిటన్ లో ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్ లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వానికి సమస్యాత్మకంగా మారింది. కాగా, బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ నిన్న మాట్లాడుతూ, దేశంలో 10 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.

అయితే, బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు అయోమయానికి గురయ్యారు. దేశంలో కనీసం 250 ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. దీంతో బ్రిటన్ ఉప ప్రధాని పొరబడ్డారని స్కై న్యూస్ మీడియా సంస్థ పేర్కొంది.

దీనిపై రాయిటర్స్ మీడియా సంస్థ బ్రిటన్ న్యాయ మంత్రిత్వ శాఖను వివరణ కోరగా, ఆరోగ్యశాఖను అడగాలని బదులిచ్చింది. అంతేకాదు, మంత్రులు చెప్పినట్టుగా 10 కేసులు అని, 250 కేసులు అని ఎవరికి నచ్చినట్టు వారు రాసుకోవచ్చని మీడియాకు సూచించింది.

దీనిపై బ్రిటన్ ఆరోగ్య శాఖ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే... ఉదయం 250 ఒమిక్రాన్ కేసులన్న ఉప ప్రధాని డొమినిక్ రాబ్... ఆ తర్వాత ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట మార్చారు. దేశంలో 9 ఒమిక్రాన్ కేసులున్నాయని చెప్పి మరింత గందరగోళం సృష్టించారు.


More Telugu News