మేం ఒకప్పటి తాలిబన్లం కాదు.. అమెరికా లాంటి పెద్ద దేశానికి ఓపిక, సహనం అవసరం: ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి

  • ఆ దేశంతో మాకేం సమస్యలు లేవు
  • మాపై ఆర్థిక ఆంక్షలతో ఎవరికేం ఒరగదు
  • ఆఫ్ఘనిస్థాన్ బాగు కోసం సంస్కరణలు తెస్తున్నాం: ముత్తాఖీ
ఆఫ్ఘనిస్థాన్ పై ఆర్థిక ఆంక్షలు విధించడం, దేశాన్ని అస్థిరపరచడం వల్ల ఎవరికైనా ఒరిగేదేమీ లేదని తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ అన్నారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం బలహీనంగా మారితే ఎవరికి లాభమని ప్రశ్నించారు. తమకు అన్ని దేశాలతో మంచి సంబంధాలే కావాలని చెప్పారు. అమెరికాతో తమకు సమస్యలేవీ లేవన్నారు. తమకు రావాల్సిన వెయ్యి కోట్ల డాలర్ల నిధులను ఫ్రీజ్ చేశారని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

‘‘అమెరికాకు నేను చెప్పేది ఒకటే. మీది పెద్ద దేశం. గొప్ప దేశం. అలాంటి దేశానికి ఓపిక, సహనం అవసరం. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆఫ్ఘనిస్థాన్  లో విధాన రూపకల్పనకు పెద్ద మనసు చేసుకోవాలి. వివాదాలన్నీ తొలగిపోయేలా ఆఫ్ఘనిస్థాన్ తో మంచి సంబంధాలు కొనసాగించాలి’’ అని ముత్తాఖీ కోరారు.  

ప్రస్తుతం దేశంలోని సగానికిపైగా జనాభా (2.3 కోట్ల మంది) ఆకలితో అలమటిస్తున్నారంటూ ఐక్యరాజ్యసమితి హంగర్ ఇండెక్స్ వెల్లడించింది. అంతేగాకుండా అక్కడ శీతాకాలం వచ్చేసినందున.. కరవు పరిస్థితులు రాజ్యమేలే ప్రమాదముందనీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ముత్తాఖీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఒకప్పుడు తాలిబన్లు అమ్మాయిల చదువు, ఉద్యోగ బాధ్యతలపై ఆంక్షలు విధించిన మాట వాస్తవమేనని, కానీ, తామిప్పుడు మారామని చెప్పారు. పాలన, రాజకీయ వ్యవహారాల్లో పురోగతి సాధించామన్నారు. రాబోయే రోజుల్లో మరింత అనుభవం సంపాదిస్తామని, దేశాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కొత్త తాలిబన్ ప్రభుత్వంలో బాలికలు పాఠశాలలకు వెళ్తున్నారని, ప్రైవేటు స్కూళ్లు, యూనివర్సిటీలు నిరాటంకంగా నడుస్తున్నాయని తెలిపారు. 100 శాతం మహిళా ఉద్యోగులు డ్యూటీలకు వెళ్తున్నారని చెప్పారు. మహిళలకు తామిస్తున్న ప్రాధాన్యమేంటో ఇవే చెబుతాయని ఆయన అన్నారు.

దేశంలో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. వారికి భద్రతనూ కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలోని ముఖ్య నేతలంతా కాబూల్ లో హాయిగా జీవిస్తున్నారని గుర్తు చేశారు. పేదరికం, మంచి జీవితం ఉంటుందన్న ఆరాటంతోనే అమెరికా వెళ్లే ఫ్లైట్ల కోసం గత ఆగస్టులో ఆఫ్ఘన్లు కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద గుమికూడారని, అంతేగానీ, తమకు భయపడి ఎవరూ వెళ్లలేదని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదట్లో తాము తప్పులు చేసిన మాట వాస్తవమేనని, కానీ, ఇప్పుడు దేశ బాగు కోసం ఎన్నెన్నో సంస్కరణలను చేపడుతున్నామని వెల్లడించారు. నాటో, అమెరికా బలగాలపై దాడులు చేశామన్న నివేదికలో వాస్తవాలు లేవని ముత్తాఖీ చెప్పారు. అనవసర ఆరోపణలు చేయడం తప్పితే.. వాటికి సంబంధించిన ఆధారాలను మాత్రం చూపడంలో వారు ఫెయిలవుతున్నారని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులతో పోరాడేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. అయితే, ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా నెమ్మదిగా తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News