'మెసస్కేల్ ఫినామినా'.... చెన్నైలో అతి భారీ వర్షానికి కారణం ఇదే!

  • ఈ నెల 6న చెన్నైలో కుండపోత వాన
  • నీట మునిగిన నగరం
  • వివరణ ఇచ్చిన వాతావరణ కేంద్రం చీఫ్
  • 'మెసస్కేల్ ఫినామినా'ను ముందుగా పసిగట్టలేమని వెల్లడి
ఈ నెల 6వ తేదీన చెన్నై మహానగరంలో అతి భారీ వర్షం పడింది. కుంభవృష్టి కారణంగా నగరం నీటమునిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... వాతావరణ శాఖ చెన్నైకి ఎలాంటి భారీ వర్ష సూచన చేయలేదు. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. కానీ చెన్నైలో ఆ రెండు జిల్లాలను మించి 207 మిల్లీమీటర్ల మేర కుండపోత వాన కురిసింది. 2015 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే ప్రథమం. ఈ పరిణామం శాస్త్రవేత్తలను కూడా విస్మయానికి గురిచేసింది.

దీనిపై వాతావరణ శాఖ దక్షిణాది విభాగం చీఫ్ బాలచంద్రన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులను 'మెసస్కేల్ ఫినామినా' అంటారని వెల్లడించారు. దీన్ని ముందుగా పసిగట్టలేమని తెలిపారు. చెన్నైలోని నుంగంబాక్కం, మీనంబాక్కం మధ్య కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమేనని, కానీ నుంగంబాక్కంలో 20 సెంటిమీటర్లు, మీనంబాక్కంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. పక్కపక్కన ఉన్న ప్రాంతాల్లోనూ తీవ్ర వ్యత్యాసంతో వర్షపాతం నమోదవడం 'మెసస్కేల్ ఫినామినా' కిందికి వస్తుందని పేర్కొన్నారు.

రోజువారీ పరిశోధనలో భాగంగా ఈ నెల 6కి సంబంధించి గాలి దిశ, మేఘాల కదలికలను పరిశీలిస్తున్నప్పుడు తమ అంచనాల్లో చెన్నై నగరంలేదని, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలకు మాత్రం భారీ వర్షసూచన ఇచ్చామని బాలచంద్రన్ చెప్పారు. కానీ చెన్నై నగరంలో ఊహించని విధంగా కొద్ది సమయంలోనే అతి భారీ వర్షం కురిసిందని వెల్లడించారు.


More Telugu News