అశ్విన్ ను పదేపదే దూరం పెడుతున్నారెందుకు?.. విచారణ జరిపించాలన్న టీమిండియా మాజీ సెలెక్టర్ వెంగ్ సర్కార్

  • టీమిండియాది ఇంత చెత్త ప్రదర్శనా?
  • ఆటగాళ్లలో ఏ కోశానా ఉత్సాహమే లేదు
  • రోహిత్ ను మూడో స్థానంలో దింపడం తప్పు
టీమిండియా ఆట తీరు పట్ల మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ మండిపడ్డారు. జట్టు ప్రదర్శన ఇంత చెత్తగా ఉంటుందని ఊహించలేదన్నారు. ఆటగాళ్లలో ఏ కోశానా ఉత్సాహమన్నదే కనిపించట్లేదని విమర్శించారు. దానికి బయో బబుల్ అలసట కారణమా? లేక మరేదైనానా? అని ఆయన అన్నారు. ఆటగాళ్ల శరీరతత్వం బాగాలేదన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా తేలిపోయిందని వ్యాఖ్యానించారు. మొదటి బంతి నుంచీ పేలవ ప్రదర్శనేనన్నారు.

రవిచంద్రన్ అశ్విన్ ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. అతడిని టీమ్ యాజమాన్యం పదేపదే పక్కనపెట్టడంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని ఫార్మాట్లలోనూ అశ్విన్ మెరుగ్గా రాణిస్తున్నాడని, మంచి రికార్డుందని, 600కుపైగా వికెట్లు తీశాడని అన్నారు. అంత సీనియర్ ను జట్టులోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లోనూ ఒక్క మ్యాచ్ ఆడించకపోవడం విస్మయం కలిగించిందన్నారు. అది తనకో పెద్ద మిస్టరీగా అనిపిస్తోందన్నారు.

ఆల్ రౌండర్ గా ఉన్న హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ చేయించకపోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదని, రోహిత్ ను మూడో స్థానంలో దింపడం మంచిది కాదని ఆయన అన్నారు. బౌండరీల వద్ద మన బ్యాటర్లు క్యాచ్ అవుటవడం ఆందోళన కలిగించేదేనని, భారత్ లో ఐపీఎల్ నిర్వహిస్తే బౌండరీల దూరం పెంచాలని ఆయన సూచించారు.


More Telugu News