హైదరాబాద్‌లో భారీ చోరీ.. వృద్దుడి కాళ్లు, చేతులు కట్టేసి రూ. 50 లక్షల విలువైన సొత్తుతో కాపలాదారు పరారీ

  • 20 రోజుల క్రితమే కాపలాదారుగా చేరిన నేపాలీ దంపతులు
  • అందరూ నిద్రించిన తర్వాత ముఠా సభ్యులను పిలిచి చోరీ
  • పనివారి వివరాలను ‘హ్యాక్ ఐ’లో నమోదు చేసుకోవాలంటున్న పోలీసులు
  • గత మూడేళ్లలో నేపాలీలపై 38 కేసులు
హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. 20 రోజుల క్రితం ఇంటి కాపాలదారుగా చేరిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. వృద్ధుడి కాళ్లు, చేతులు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి రూ. 50 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ. 5 లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు.  స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యజ్ఞ అగర్వాల్ వస్త్రవ్యాపారి. భార్య, పిల్లలు, తాత ఓం ప్రకాష్ అగర్వాల్, నాయనమ్మతో కలిసి చింతలబస్తీలోని ఐదు అంతస్తుల భవనంలో ఉంటున్నారు. నేపాల్‌కు చెందిన దీపేష్, నిఖిత దంపతులు 20 రోజుల క్రితం వారింట్లో కాపలాదారులుగా చేరారు.

యజ్ఞ అగర్వాల్ తాత ఓం ప్రకాశ్ అనారోగ్యం పాలవడంతో కాపలాదారు దీపేశ్ ఆయనకు సాయంగా ఉంటున్నాడు. శుక్రవారం యజ్ఞ భార్యాపిల్లలతో కలిసి ఐదో అంతస్తులో నిద్రించగా, ఓంప్రకాశ్ అగర్వాల్, దీపేష్ నాలుగో అంతస్తులో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దీపేష్.. భార్య నిఖితతో పాటు మరో ముగ్గురిని పిలిపించాడు. అందరూ కలిసి ఓంప్రకాశ్ కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి బీరువాలోని రూ. 50 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ. 5 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు.

ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పరిస్థితులు గమనించిన పోలీసులు ఇది నేపాలీ ముఠా పనేనని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత మూడేళ్లలో నేపాలీలపై 38 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఎవరైనా కొత్తగా పనివాళ్లను చేర్చుకోవాలనుకుంటే ముందుగా హైదరాబాద్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్ ‘హ్యా‌క్ఐ’ లో వారి వివరాలు నమోదు చేస్తే, వారి నేరచరిత్ర గురించి వివరిస్తామని పేర్కొన్నారు.


More Telugu News