అక్టోబరు 24న భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్... హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

  • ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్
  • యూఏఈ వేదికగా ఐసీసీ మెగా ఈవెంట్
  • దుబాయ్ స్టేడియంలో దాయాదుల సమరం
  • 70 శాతం ప్రేక్షకులతో మ్యాచ్ లకు అనుమతి
ఐపీఎల్ ముగిసిన తర్వాత యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ దాయాది జట్ల మధ్య అక్టోబరు 24న కీలక సమరం జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కు టికెట్లు అప్పుడే అయిపోయాయి. అమ్మకానికి ఉంచిన కొన్ని గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కు 70 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్-పాక్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 25 వేలు కాగా, ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం 18,500 సీట్లు అందుబాటులో ఉంటాయి.

చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్లు ఎప్పుడు, ఎక్కడ తలపడినా విపరీతమైన ప్రజాదరణ ఉంటుంది. రాజకీయ కారణాలతో ఇరుజట్లు ద్వైపాక్షిక సిరీస్ లకు దూరం కాగా, ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి.


More Telugu News