అబద్ధాలను మార్కెట్ చేయడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు: కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ధ్వజం

  • చాలాచోట్ల దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారు 
  • కర్ణాటకలో పాలన పగ్గాలు ఆరెస్సెస్ చేతిలోనే
  • బీజేపీ, ఆరెస్సెస్‌లో హిట్లర్ జన్యువులు
కర్ణాటకలోని అధికార బీజేపీపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఆర్.గుండూరావు జయంతి సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎలాంటి ప్రజాబలం, ప్రజామోదం లేకుండానే దేశంలోని చాలా చోట్ల బీజేపీ దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. సబ్‌ కా సాథ్, సబ్ కా వికాస్ అని చెప్పే ప్రధాని మోదీ తన మంత్రివర్గంలో క్రైస్తవులు, ముస్లింలకు చోటు కల్పించలేదన్నారు.

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ పాలన మాత్రం సంఘ పరివారే చూసుకుంటోందని ఆరోపించారు. అబద్ధాలు సృష్టించడం, వాటిని మార్కెటింగ్ చేయడం బీజేపీ నేతలకు కొట్టినపిండి అని విమర్శించారు. హిట్లర్ పాలనలో పాల్ జోసెఫ్ గ్లోబెల్స్ అనుసరించిన సిద్ధాంతాన్నే బీజేపీ కూడా పాటిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో హిట్లర్ జన్యువులు ఉన్నాయని, బీజేపీ నేతలు తాలిబన్లతో సమానమని, వారితో జాగ్రత్తగా ఉండాలని సిద్ధరామయ్య సూచించారు.


More Telugu News