రోహిత్ శర్మ కెప్టెన్​ అయితే అడిగేవాడినే: తనను పక్కనపెట్టేయడంపై కుల్దీప్​ స్పందన

  • ఐపీఎల్ లో అతడిని పక్కనపెట్టిన కోల్ కతా
  • కనీసం వివరణ కూడా ఇవ్వలేదని ఆవేదన
  • జట్టులో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న చైనామన్ బౌలర్
  • భారత కెప్టెన్ ఉంటే నేరుగా అడిగేవాడినని కామెంట్
కుల్దీప్ యాదవ్.. ఫాం లేమితో సతమతమవుతున్న ఈ చైనామన్ బౌలర్ కు జట్టులో చోటే దాదాపు కష్టమైపోయింది. జట్టులోకి ఇలా వస్తూ అలా వెళ్లిపోతున్నాడు. నాలుగు నెలల క్రితమే శ్రీలంకతో జరిగిన సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే, ఇప్పుడు అతడికి మరో సమస్య కూడా వచ్చిపడింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న అతడిని.. జట్టు యాజమాన్యం పక్కనపెట్టేసింది. దానికి కారణమూ చెప్పలేదంటూ అతడిప్పుడు వాపోతున్నాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్ వీడియో ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

బహుశా తన ప్రతిభపై జట్టు యాజమాన్యానికి నమ్మకం లేదేమోనంటూ ఆవేదన చెందాడు. జట్టుకు భారత కెప్టెన్ లేకపోవడమూ టీమ్ లో కమ్యూనికేషన్ గ్యాప్ నకు కారణమైందని అన్నాడు. ఇప్పుడున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన గురించి ఏమనుకుంటున్నాడో తెలియదుగానీ.. భారత కెప్టెన్ ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా తాను మాట్లాడేవాడినని చెప్పాడు.

‘‘భారత కెప్టెన్ అయితే నేరుగా మనం అతడి దగ్గరికి వెళ్లిపోవచ్చు. జట్టులోకి ఎందుకు తీసుకోలేదో అడగవచ్చు. ఉదాహరణకు రోహిత్ శర్మను తీసుకోండి.. ఎవరైనా అతడి దగ్గరకు వెళ్లే స్వేచ్ఛ ఉంది. జట్టులో పాత్రేంటి? ఎక్కడ మెరుగవ్వాలి? వంటి విషయాలను అతడిని నిస్సందేహంగా అడిగి తెలుసుకోవచ్చు. అలాంటివారుంటే నేను కచ్చితంగా వెళ్లి అడిగేవాడిని’’ అని చెప్పుకొచ్చాడు.

కోల్ కతా టీంలో ఇప్పుడు లోపించింది కమ్యూనికేషన్ గ్యాపేనని అతడు అన్నాడు. చెప్పాపెట్టకుండా తుది జట్టు నుంచి తీసేస్తారన్నాడు. దీనిపై ఓ సారి జట్టు యాజమాన్యాన్ని సంప్రదించినా వారి నుంచి ఎలాంటి స్పందనగానీ, వివరణ గానీ రాలేదన్నాడు. జట్టులో చాలా మంది స్పిన్నర్లు, బౌలర్లున్నప్పుడే ఇలా జరుగుతుందని, టీమ్ కు తనపై నమ్మకం లేదేమోనని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.


More Telugu News