"నాకు ఎండ్ కార్డే లేదురా"... పనైపోయిందన్న విమర్శకులకు కమెడియన్ వడివేలు సమాధానం

  • చాన్నాళ్లుగా సినిమాలకు దూరమైన వడివేలు
  • దర్శకుడు శంకర్ తోనూ వివాదం
  • చెన్నైలో తాజాగా మీడియా సమావేశం
  • ఇక శంకర్ స్నేహం వద్దంటూ వ్యాఖ్యలు
వడివేలు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరంలేదు. దశాబ్దాలుగా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం ఎలాగో, తమిళులకు వడివేలు అలాగ! అయితే వడివేలుకు కోలీవుడ్ లో అనుకోని విధంగా గ్యాప్ వచ్చింది. కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తోనూ విభేదాలు ఏర్పడ్డాయి. వీటన్నిటి గురించి వడివేలు తాజాగా ఓ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.

తాను షూటింగ్ కు రాకుండా ఇబ్బంది పెడతానన్నది అబద్ధమని స్పష్టం చేశారు. తన వల్ల రూ.100 కోట్లు నష్టం వచ్చినట్టు చెబుతున్నారని, అది ఏ కొంచెమైనా నమ్మశక్యంగా ఉందా? అని ప్రశ్నించారు. ఇకమీదట తాను శంకర్ తో ఫ్రెండ్షిప్ కు గుడ్ బై చెబుతున్నానని, ఆయన సినిమాల్లో నటించే ఉద్దేశమే లేదని వడివేలు స్పష్టం చేశారు.

"చాలా మంది నా పనైపోయిందంటున్నారు... ఇక సినిమాల్లో నటించలేనని అంటున్నారు. నేనో సినిమాలో "నాకు ఎండ్ కార్డే లేదురా" అనే డైలాగ్ చెప్పాను. నా సినీ జీవితానికి సంబంధించినంతవరకు ఆ డైలాగే నా సమాధానం. కొన్నిరోజుల కిందట ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిశాను. ఆయనతో సమావేశం తర్వాత నుంచి చాలా సమస్యలు తొలగిపోయాయి. మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి" అని వడివేలు వివరించారు.

కొన్నేళ్ల కిందట శంకర్ నిర్మాతగా వడివేలు కథానాయకుడిగా 'హింసించే 23వ రాజు పులికేసి' అనే కామెడీ చిత్రం వచ్చింది. ఇది హిట్టవడంతో సీక్వెల్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందులోనూ వడివేలు ప్రధాన పాత్రధారి కాగా, సినిమా సగం షూటింగ్ జరిగాక కథ విషయంలో వడివేలు అసంతృప్తి వ్యక్తంచేసి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో శంకర్, వడివేలు మధ్య వివాదం ఏర్పడింది.

తనకు వడివేలు కారణంగా రూ.1 కోటి నష్టం వచ్చిందంటూ శంకర్ నిర్మాతల మండలిని ఆశ్రయించగా, నిర్మాతల మండలి వడివేలుపై నిషేధం విధించింది. ఆ తర్వాత నిషేధం తొలగిపోయినా వడివేలు మాత్రం సినిమాల్లో నటించలేదు. తాజాగా మళ్లీ సినిమాల్లో నటించేందుకు సన్నద్ధమవుతున్నారు.


More Telugu News