పారాలింపిక్స్‌లో మెడల్ ఖాయం చేసిన భవీనాబెన్ పటేల్

  • టోక్యో పారాలింపిక్స్‌లో సెమీస్ చేరిన భవీనాబెన్
  • టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం
  • 2016 రియో ఛాంపియన్‌ను మట్టికరిపించిన భవీనా 
  • సెమీస్‌లో ఓడినా రజతం ఖాయం
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. అది కూడా ఇప్పటి వరకూ పతకం ఎరుగని టేబుల్ టెన్నిస్ క్రీడలో. ఈ టోర్నీలో తొలిసారిగా భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్.. టేబుల్ టెన్నిస్ సెమీస్ చేరింది. 34 ఏళ్ల భవీనాబెన్ తన ప్రత్యర్థి, సెర్బియాకు చెందిన బోరిస్లావా పెరిక్ ర్యాంకోవిక్‌పై ఘన విజయం సాధించింది. 2016 రియో పారాలింపిక్స్‌లో బోరిస్లావా ఛాంపియన్ కావడం గమనార్హం.

ఈ మాజీ ఛాంపియన్‌తో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భవీనా 11-5, 11-6, 11-7తో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ గెలిచింది. దీంతో ఆమె సెమీస్‌కు చేరింది. టేబుల్ టెన్నిస్ నిబంధనల ప్రకారం సెమీస్‌లో ఓడిపోయిన ప్రత్యర్థులు రజత పతకం కోసం పోటీ పడాల్సిన అవసరం లేదు. వీరిద్దరికీ రజత పతకాలు అందజేస్తారు. అంటే భారత్‌కు ఈ క్రీడలో రజత పతకం ఖాయమైనట్లే.

శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో చైనాకు చెందిన ఝాంగ్ మియావోతో భవీనా తలపడనుంది. ‘‘ఆమె నుంచి ఒక పతకం రావడం మాత్రం ఖాయం. అయితే రేపు (శనివారం) జరిగే మ్యాచ్‌తో అది ఏ రంగో తెలుస్తుంది’’ అని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు దీపా మాలిక్ అన్నారు.


More Telugu News