'బంగార్రాజు' కోసం బరిలోకి దిగిన నాగ్, చైతూ!

  • గ్రామీణ నేపథ్యంలో 'బంగార్రాజు'
  • నాగ్ సరసన రమ్యకృష్ణ
  • చైతూ జోడీగా కృతి శెట్టి
  • మొదలైన రెగ్యులర్ షూటింగ్
  • 'మనం' తరువాత నాగ్ - చైతూ కాంబినేషన్  
నాగార్జున కొంతకాలం క్రితం చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, సంక్రాంతి బరిలో నిలిచి భారీ వసూళ్లను రాబట్టింది. 'బంగార్రాజు' టైటిల్ తో ఈ సినిమాకి ప్రీక్వెల్ చేయడానికి దర్శకుడు కల్యాణ్ కృష్ణతో కలిసి నాగార్జున రంగంలోకి దిగారు.

ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక మరో ప్రధానమైన పాత్రను పోషించనున్న చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజున మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. పల్లెటూరులోని ఓ వాకిట్లో నాగ్ .. చైతూల కోసం అన్నట్టుగా రెండు బుల్లెట్లు సిద్ధంగా ఉంచారు.

ఆ బుల్లెట్లకు ముందు మల్లెపూలు .. వెనుక ముల్లుగర్ర కట్టేసి, పల్లెటూరి బుల్లోళ్ల మాదిరిగా ఇద్దరూ రొమాంటిక్ హీరోలుగానే కనిపించనున్నారనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. 'మనం' తరువాత నాగ్ - చైతూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో, అందరిలో ఆసక్తి తలెత్తడం సహజం.


More Telugu News