అక్టోబరు నుంచి నెలకు కోటి వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తాం: జైడస్ క్యాడిలా చీఫ్

  • భారత్ లో మరో దేశీయ వ్యాక్సిన్
  • జైకోవ్-డి వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి
  • తొలి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్
  • వ్యాక్సిన్ ఉత్పాదకతపై జైడస్ క్యాడిలా ఎండీ వివరణ
దేశంలో 12 ఏళ్ల పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉపయోగించే వీలున్న జైకోవ్-డి కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం నిన్న అనుమతి ఇచ్చింది. జైకోవ్-డి వ్యాక్సిన్ ను దేశీయ ఫార్మా జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసింది. క్యాడిలా సంస్థ ఎండీ షర్విల్ పటేల్ తాజా పరిణామాలపై మాట్లాడుతూ, అక్టోబరు నుంచి నెలకు కోటి వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయగలమని వెల్లడించారు.

డిసెంబరు-2022 జనవరి నాటికి నెలకు 3.5 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం సంతరించుకుంటామని తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అభిలషిస్తున్న విధంగా ఆగస్టు నుంచి డిసెంబరు మధ్యన 5 కోట్ల డోసులు ఉత్పత్తి చేయలేమని షర్విల్ పటేల్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ డోసుల ఉత్పాదన, వ్యాక్సిన్ డేటా బదలాయింపు కోసం ఇతర కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.

ఇక వ్యాక్సిన్ వ్యయంపై స్పందిస్తూ, జైకోవ్-డి వ్యాక్సిన్ ను నూతన సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేశామని, పంపిణీ వ్యవస్థల విధానం తదితర అంశాలపై వ్యయం ఆధారపడి ఉంటుందని వివరించారు.

జైకోవ్-డి మూడు డోసుల వ్యాక్సిన్. ఇది మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో కలిసి జైడస్ క్యాడిలా ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ తర్వాత, దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్ ఇదే.


More Telugu News