పెగాసస్ వ్యవహారం.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

  • దేశ భద్రత విషయంలో రాజీపడాలని కోర్టు కోరుకోవడం లేదు
  • తమ ఫోన్లపై నిఘా ఉంచారని పిటిషనర్లు వాదిస్తున్నారు
  • ప్రభుత్వ స్పందన తర్వాత విచారణ కమిటీ ఏర్పాటు చేస్తాం
దేశ భద్రత విషయంలో రాజీపడాలని తాము కోరుకోవడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ ఫోన్లపై నిఘా ఉంచారని పిటిషనర్లు వాదిస్తున్నారని పేర్కొంది. అయితే, సున్నితమైన అంశాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు వెల్లడించాలని తాము అడగడం లేదని పెగాసస్ స్పైవేర్ పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇజ్రాయల్ కు చెందిన ఈ స్పైవేర్ ను వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునేందుకు వినియోగించుకున్నారనే ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలిపిన తర్వాత విచారణ కమిటీని ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.  

అయితే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపిస్తూ పబ్లిక్ డొమైన్ లో పెగాసన్ వివరాలను ఉంచడం దేశ భద్రతకు విఘాతం కల్పిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విచారణ జరపాలనే అందరు పిటిషనర్లు కోరుతున్నారని చెప్పారు. పెగాసస్ ను ఉపయోగించారా? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిన్న అడిగారని అన్నారు. ఈ సాఫ్ట్ వేర్ ను అన్ని దేశాలు కొన్నాయని చెప్పారు.  

అయితే భద్రతా కారణాల వల్ల ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించారా? లేదా? అనే ప్రశ్నకు ఏ దేశం సమాధానం చెప్పడం లేదని అన్నారు. కోర్టు వద్ద తాము ఏదీ దాచాలనుకోవడం లేదని తుషార్ మెహతా చెప్పారు. కోర్టు ఏర్పాటు చేసే కమిటీ ముందు తాము అన్ని వివరాలను ఉంచుతామని వెల్లడించారు. అయితే అఫిడవిట్ల ద్వారా ఆ వివరాలను బహిర్గతం చేయలేమని చెప్పారు.


More Telugu News