రాజీనామా లేఖ‌ను గ‌వ‌ర్న‌ర్‌కు సమర్పించిన య‌డియూర‌ప్ప‌.. దళితవర్గం నుంచి కొత్త ముఖ్యమంత్రి?

  • నేరుగా రాజ్‌భ‌వ‌న్ కు వెళ్లిన య‌డియూర‌ప్ప‌
  • రేపు బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం
  • కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న అధిష్ఠానం  
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆయ‌న నేరుగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ థావర్ చంద్ గహ్లోత్‌ కు రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. మధ్యాహ్నం రెండు గంటలకు గవర్నర్ కార్యాలయానికి వెళ్ల‌డానికి ఆయ‌న నిన్న‌నే అపాయింట్ మెంట్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మరోపక్క, క‌ర్ణాట‌క కొత్త ముఖ్య‌మంత్రి పేరును బీజేపీ అధిష్ఠానం ఖ‌రారు చేయ‌నుంది. ఇందుకోసం రేపు ఢిల్లీలో బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం కానుంది. కాగా, కర్ణాటకలో నాయకత్వ మార్పు తప్పదని ఇటీవ‌ల ఊహాగానాలు వచ్చాయి. చివరికి అవి నిజ‌మ‌వుతున్నాయి. య‌డియూర‌ప్ప‌ క‌ర్ణాట‌క‌కు నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. రెండేళ్ల క్రితం క‌ర్ణాట‌క సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలాక ఆయ‌న సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

నేటితో ఆయ‌న ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. య‌డియూర‌ప్ప‌కు 78 ఏళ్లు కావ‌డం, ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం వంటి అంశాలు ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి కార‌ణాలుగా తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారు ప‌ద‌వుల్లో ఉండ‌డానికి వీల్లేద‌ని బీజేపీ నియ‌మాలు పాటిస్తోంది. సీఎం ప‌దవికి రాజీనామా చేసిన‌ప్ప‌టికీ పార్టీ అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాన‌ని య‌డియూర‌ప్ప అన్నారు.

ఇదిలావుంచితే, క‌ర్ణాట‌క‌లో ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తార‌న్న ప్రచారం కూడా జ‌రుగుతోంది. క‌ర్ణాట‌క త‌దుప‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశంలో జ‌రిగే త‌దుప‌రి లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని రేపు బీజేపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది.


More Telugu News